● సంఘటనా స్థలంలో హత్య చేసినట్లు ఆనవాళ్లు
● దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పిఠాపురం: పట్టణ శివారు చిత్రాడ రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద బుధవారం ఒక వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఎవరో ఒక వ్యక్తి చనిపోయి పడి ఉన్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ ఎస్సై మణికుమార్ వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు సుమారు 45 ఏళ్ల వయసు గల గుర్తుతెలియని వ్యక్తిగా పోలీసులు తెలిపారు.
బండరాయితో మోది..
మృతదేహం లభ్యమైన ప్రాంతంలో ఒక బండ రాయి రక్తపు మరకలతో ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. అక్కడే మద్యం బాటిళ్లు లభ్యం కావడంతో మద్యం సేవించి అనంతరం బండరాయితో కొట్టి చంపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా కేసు దర్యాప్తు ప్రారంభించారు.