
మంచి అలవాటుగా తపాలా బిళ్లల సేకరణ
బాలాజీచెరువు (కాకినాడ): సాంకేతికత పెరుగుతున్న క్రమంలో ప్రతి ఒక్కరూ తపాలా బిళ్ల సేకరణ మంచి అలవాటుగా మార్చుకోవాలని జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్.రామచంద్రరావు పేర్కొన్నారు. స్థానిక సినిమా రోడ్డులోని సూర్య కళా మందిరంలో బుధవారం జిల్లా స్థాయి ఫిలాటెలి ఎగ్జిబిషన్ (తపాలా బిళ్లల ప్రదర్శన)‘ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ఈ ఫిలాటెలి అభిరుచి అతి ప్రాచీనమైనదని, తపాలా శాఖ తరచుగా విడుదల చేసే స్టాంపుల వలన ఈ కళ అజరామరంగా భావితరాలకు అందాలని ఆకాంక్షించారు. అసిస్టెంట్ డైరెక్టర్ (ఫిలాటెలి), ఆంధ్రప్రదేశ్ సర్కిల్, విజయవాడ జి.శివనాగరాజు మాట్లాడుతూ ఫిలాటెలి అభిరుచి గల అభిమానులు, ఔత్సాహికులు ఒకే వేదికపై తరచూ ఇలా ప్రదర్శనల ద్వారా ఈ కళకు జీవం పోస్తున్నారని కొనియాడారు. కాకినాడ డివిజనల్ సూపరింటెండెంట్ కె.కృష్ణ, అసిస్టెంట్ సూపరింటెండెంట్ (హెడ్ క్వార్టర్స్) గంటి రామకృష్ణ పి.వి.రమణమూర్తి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ (రెగ్యులర్), సామర్లకోట అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ డి.అనిల్ అంబేడ్కర్ కుమార్ పాల్గొన్నారు.