
రత్నగిరిపై ‘కార్తిక’ ఏర్పాట్లు
అన్నవరం: ఈ నెల 22 తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కొనసాగనున్న కార్తికమాసంలో సత్యదేవుని సన్నిధికి విచ్చేసే భక్తుల కోసం ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని బుధవారం రత్నగిరిపై జరిగిన దేవస్థానం, ప్రభుత్వ శాఖల అధికారుల సమావేశంలో నిర్ణయించారు. ప్రకాష్‌సదన్ సత్రంలోని ట్రస్ట్‌బోర్డు సమావేశ హాలులో జరిగిన సమావేశానికి దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షత వహించారు.
కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు మాట్లాడుతూ నవంబర్ రెండో తేదీన సత్యదేవుని తెప్పోత్సవం, ఐదో తేదీన గిరి ప్రదక్షిణ కార్యక్రమాలకు వేలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కోరారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ భక్తులకు సత్యదేవుని దర్శనం సులభంగా జరిగేలా, వ్రతాల నిర్వహణ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు, ఎస్‌ఐ శ్రీహరి బాబు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు దేవస్థానం అధికారులు, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎస్.కుమార్‌రాజా పాల్గొన్నారు. కార్తిక మాసోత్సవ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు
● వ్రతాలు, దర్శనం టిక్కెట్లు, ప్రసాదాల విక్రయాలకు అదనంగా కౌంటర్ల ఏర్పాటు
● పర్వదినాలలో పశ్చిమ రాజగోపురం వద్ద
రోప్ పార్టీ ఏర్పాటు చేసి బృందాల
వారీగా దర్శనానికి భక్తులకు అనుమతి
● రెండో తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి పంపా నదిలో జరిగే తెప్పోత్సవానికి 20 మంది గజ ఈతగాళ్లు, తెప్పకు ఎస్కార్ట్ గా రెండు బోట్లు ఏర్పాటు
● గిరి ప్రదక్షిణ జరిగే ఐదో తేదీన రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ దీపాల ఏర్పాటు
● నెల రోజులు చిన్నకార్లు, ఆటోలు మినహా మరే ఇతర పెద్ద వాహనాలను కొండమీదకు అనుమతించరు.
● రత్నగిరి, సత్యగిరి పై సుమారు వేయి కార్లు, మూడు వేల బైకులు నిలిపేందుకు పార్కింగ్ స్థలాలు సిద్ధం
● మెయిన్ క్యాంటీన్ భవనాన్ని డార్మెట్రీ గా చేయాలని నిర్ణయం.
● గిరి ప్రదక్షిణ రోడ్డులో 24 తాత్కాలిక టాయిలెట్స్ ఏర్పాటు
● బెండపూడి వైపు ఆర్చి నుంచి మండపం సెంటర్ ఆర్చి వరకు రోడ్డుకు మరమ్మతులు
● ముఖ్యమైన దేవస్థానం అధికారులకు 20 వాకీటాకీలు అందించాలని నిర్ణయం. ప్రస్తుతం ఉన్న 20 వాకీటాకీ లకు ఇవి అదనం.
● రత్నగిరిపై అన్నిచోట్లా సీసీ టీవీ కెమెరాలు, పశ్చిమ రాజగోపురం, ఆలయ ప్రాంగణంలో రెండు చోట్ల రెండు సమాచార కేంద్రాలు, పోలీస్ ఔట్‌పోస్టు ఏర్పాటు
● విజయవాడ, విశాఖపట్నం, జిల్లాలోని ముఖ్య పట్టణాల నుంచి అదనపు ఆర్టీసీ బస్‌లు