ఏలేశ్వరం: నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి శవమై కనిపించడంతో పోలీసులు హత్యగా అనుమానిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, అడ్డతీగల మండలం డి.కొత్తూరుకు చెందిన బొదిరెడ్డి వెంకటేశ్వర్లు సీజనల్ వ్యాపారం చేస్తుంటాడు. ఈ నెల రెండో తేదీన దసరా కావడంతో ఏలేశ్వరంలో నివసిస్తున్న కుమారుడు ఆంజనేయులు ఇంటికి వచ్చాడు. దసరా రోజు కావడంతో బంగారు ఆభరణాలు ధరించి, కొంత నగదు తీసుకుని వేరే వ్యక్తితో కలిసి ఏజెన్సీకి వెళ్లాడు. మధ్యాహ్నం భోజన సమయం దాటాక ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ మేరకు కుమారుడు ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు సమీపంలోని బొంతువలస ప్రాంతం వద్ద వెంకటేశ్వర్లు మృతదేహాన్ని గుర్తించారు. మృతుడితో వెళ్లిన వ్యక్తిని పోలీసులు ఆరా తీయగా, విషయం బయటపడింది. మృతుడికి భార్య సత్యవతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఏలేశ్వరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.