ఆయిల్‌ ఫామ్‌ కొనసాగేనా! | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ ఫామ్‌ కొనసాగేనా!

Oct 4 2025 1:58 AM | Updated on Oct 4 2025 2:04 AM

రంగంపేట: మెట్ట రైతులకు వరంగా మారిన ఆయిల్‌పామ్‌ గెలల ధర తరచుగా ఆటుపోట్లకు గురవుతూండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీస మద్దతు ధర ఇచ్చే పంటల జాబితాలో లేకపోవడం.. ఆశించిన ధర దక్కకపోవడం వారిని కలవరపరుస్తోంది. ఆయిల్‌పామ్‌ గెలలు టన్నుకు 2023లో అత్యధికంగా రూ.23 వేల రికార్డు స్థాయి ధర లభించింది. ఆ తరువాతి సంవత్సరం పామాయిల్‌ కంపెనీలు సిండికేట్‌ అయి, ఒక్కసారిగా ధరను ఏకంగా రూ.13,500కు తగ్గించేశాయి. అనంతరం క్రమంగా ఆయిల్‌పామ్‌ ధరలు ఒడుదొడుకులకు గురవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో టన్ను గెలల ధర రూ.20,050 ఉండేది. అది ఫిబ్రవరిలో రూ.20,727కు, మార్చిలో రూ.20,935కు పెరిగింది. పరిస్థితి బాగానే ఉందని రైతులు ఆనందించినంతసేపు కూడా లేకుండా ఈ ధర కాస్తా జూన్‌ నాటికి రూ.17,340కి పడిపోయింది.

సుంకం తగ్గింపు.. శాపం

అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారిని మరిన్ని కష్టాల్లోకి నెట్టేసింది. ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని కేంద్రం అప్పట్లో 27 శాతం నుంచి ఏకంగా 10 శాతానికి తగ్గించింది. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆయిల్‌పామ్‌ రైతులు టన్నుకు రూ.3,595 మేర నష్టపోయారు. ఒక దశలో నష్టాల ఏటికి ఎదురీదలేక ఆయిల్‌పామ్‌ తోటలను తొలగించే దిశగా రైతులు ఆలోచనలు చేశారు. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఫలితంగా గెలల ధర క్రమంగా పెరుగుతూ వస్తోంది. జూలై నాటికి రూ.17,997, ఆగస్టులో రూ.19,107, సెప్టెంబర్‌లో రూ.19,370కు ధర పెరిగింది. ఈ ధర ఈ నెలలో కూడా కొనసాగవచ్చని, నవంబర్‌ నాటికి రూ.20 వేల మార్కుకు చేరుతుందని రైతులు భావిస్తున్నారు. టన్ను గెలలకు రూ.22 వేల నుంచి రూ.25 వేల వరకూ ధర ఇవ్వాలని వారు కోరుతున్నారు.

80 వేల ఎకరాల్లో..

రాష్ట్రంలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ఆయిల్‌పామ్‌ తోటలు ఉండగా.. సింహభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఈ పంట ఉంది. ఉమ్మడి పశ్చి మ గోదావరి జిల్లాలో 1.50 లక్ష ఎకరాలు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 80 వేల ఎకరాల్లో ఈ పంట సాగు జరుగుతోంది. ఇందులో 20 వేల ఎకరాలు ఇంకా ఫలసాయానికి రాని తోటలే ఉన్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి కొవ్వూరు, రాజమహేంద్రవరం, పెద్దాపురం, కాకినాడతో పాటు, రంపచోడవరం, రామచంద్రపురం, అమలాపురం డివిజన్లలో రైతులు ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్నారు. ఒక్క కొవ్వూరు డివిజన్‌లోనే 55,432 ఎకరాల్లో ఈ తోటలున్నాయి. ఇంకా గండేపల్లి, రాజానగరం, రంగంపేట, పెద్దాపురం, జగ్గంపేట మండలాలు ఆయిల్‌సాగులో దూసుకుపోతున్నాయి. రంగంపేట మండలం మర్రిపూడి గ్రామంలోని మొత్తం వ్యవసాయ భూమిలో 65 శాతం ఈ తోటల సాగే జరుగుతోంది.

కౌలు విధానం

వరి మాదిరిగానే ఆయిల్‌పామ్‌ తోటలను కూడా కొంత మంది రైతులు కౌలుకు సాగు చేస్తున్నారు. తోటల దిగుబడి ఆధారంగా మూడు నుంచి ఐదు టన్నుల శిస్తు రైతులకు లభిస్తుంది. టన్ను గెలల ధర రూ.23 వేలున్నప్పుడు కౌలుదారులు తోటలను శిస్తుకు తీసుకునేందుకు ఎగబడేవారు. ఆ ధర రూ.13 వేలకు దిగజారినప్పుడు వెనుకంజ వేశారు. తాజాగా మళ్లీ ఆయిల్‌పామ్‌లో కౌలుదారుల ఉనికి కనిపిస్తోంది. టన్నులకు బదులుగా ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.70 వేలు నగదు రూపంలో ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. నూనె గింజల అభివృద్ధి పథకంలో భాగంగా కొత్తగా ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటే వారికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం హెక్టారుకు రూ.25 వేల సహాయం అందిస్తోంది. ఈ కారణంగా ఆయిల్‌పామ్‌ తోటల విస్తీర్ణం తిరిగి పెరుగుతుందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు.

పెట్టుబడులు పెరిగాయి

పెరిగిన వ్యవసాయ పెట్టుబడుల దృష్ట్యా టన్ను ఆయిల్‌పామ్‌ గెలలకు రూ.22 వేలకు తగ్గకుండా ధర ఇవ్వాలి. దీనిని కనీస మద్దతు ధరల పంటల జాబితాలో చేర్చాలి. తెల్లదోమ సమస్యను ఉద్యాన శాఖ పరిష్కరించాలి. రాయితీపై సేంద్రియ ఎరువులు అందించాలి.

– పుట్టా సోమన్న చౌదరి, ఆయిల్‌పామ్‌ రైతు,

మర్రిపూడి, రంగంపేట మండలం

ప్రభుత్వాలు ప్రోత్సహించాలి

ఆయిల్‌పామ్‌ రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. టన్ను గెలలకు రూ.25 వేల ధర ఇవ్వాలి. దిగుమతి సుంకాలతో ఆయిల్‌పామ్‌ గెలల ధరకు ముడి పెట్టకూడదు. తోటలపై వైట్‌ ఫ్లై(తెల్లదోమ) కారణంగా గెలల దిగుబడి తగ్గిపోవడం వలన కూడా రైతు నష్టపోతున్నాడు. నూనె శాతాన్ని నిర్ణయించే పెదవేగి ఆయిల్‌పామ్‌ కర్మాగారాన్ని ప్రైవేటీకరించకూడదు.

– పెండ్యాల బుజ్జిబాబు, తూర్పు గోదావరి జిల్లా

ఆయిల్‌పామ్‌ రైతు సంఘం అధ్యక్షుడు, రంగంపేట

ఫ మెల్లమెల్లగా పుంజుకుంటున్న ధర

ఫ ప్రస్తుతం రూ.19,370కు చేరిక

ఫ వచ్చే నెలలో రూ.20 వేలకు

చేరుతుందని ఆశిస్తున్న రైతులు

ఫ కనీసం రూ.25 వేలు

ఇవ్వాలని డిమాండ్‌

ఈ ఏడాది ఆయిల్‌పామ్‌ గెలల ధరలు (టన్నుకు రూ.లు)

నెల ధర

జనవరి 20,050

ఫిబ్రవరి 20,727

మార్చి 20,935

ఏప్రిల్‌ 20,123

మే 18,650

జూన్‌ 17,340

జూలై 17,997

ఆగస్టు 19,107

సెప్టెంబర్‌ 19,370

ఆయిల్‌ ఫామ్‌ కొనసాగేనా!1
1/3

ఆయిల్‌ ఫామ్‌ కొనసాగేనా!

ఆయిల్‌ ఫామ్‌ కొనసాగేనా!2
2/3

ఆయిల్‌ ఫామ్‌ కొనసాగేనా!

ఆయిల్‌ ఫామ్‌ కొనసాగేనా!3
3/3

ఆయిల్‌ ఫామ్‌ కొనసాగేనా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement