
బ్యాంకు మేనేజర్‌ని బురిడీ కొట్టించిన మహిళ
నిడదవోలు: రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే మంచి లాభాలు వస్తాయని ఓ బ్యాంక్ మేనేజర్‌ను మాయమాటలతో నమ్మించి, అతని వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు తీసుకున్న మహిళపై నిడదవోలు పట్టణ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. నిడదవోలు పట్టణ సీఐ తిలక్ తెలిపిన వివరాల ప్రకారం. నిడదవోలు పట్టణంలో గతంలో పనిచేసిన ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్ చప్పిడి శ్రీనివాస్ వద్ద నుంచి పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన అంబటి ఉమా (అలియాస్ శ్రావ్యారెడ్డి) దఫదఫాలుగా రూ.1.30 కోట్లు తీసుకుంది. నూజివీడు ఇతర ప్రాంతాల్లో పొలాలు ఉన్నాయని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే మంచి లాభాలు వస్తాయని చెప్పి మాయమాటలు చెప్పి బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్‌ను నమ్మించింది. ఈ క్రమంలో లోన్ వంకతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి భారీ మొత్తం కావాలంటూ పలుమార్లు బ్యాంకు మేనేజర్ వద్దకు వచ్చేది. ఇలా తరుచుగా వస్తూ పెద్ద మొత్తంలో నగదు తీసుకుంది. బ్యాంకు మేనేజర్ బంధువులు, తెలిసిన వారి వద్ద నుంచి సొమ్ములు తీసుకుని నిందితురాలు అంబటి ఉమకు ఇచ్చారు. ఆ డబ్బులతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ బంగారం కూడా కొనుగోలు చేసింది. తీరా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా లేదని మోసపోయినట్లు బ్యాంకు మేనేజర్ గ్రహించారు. తీసుకున్న రూ.1.30 కోట్లు డబ్బులు ఇవ్వాలని ఆమెను బ్యాంక్ మేనేజర్ చప్పిడి శ్రీనివాస్ తరచూ అడిగేవారు. ఈ క్రమంలో డబ్బుల గురించి అడిగితే అత్యాచారం చేశావని, నన్ను వాడుకొని మోసం చేశావని కేసు పెడతానని నిందితురాలు మేనేజర్‌ను బెదిరించింది. ఈ మేరకు బ్యాంకు మేనేజర్ చప్పిడి శ్రీనివాసరావు పట్టణ పోలీసులను ఆశ్రయించి ఆమైపె ఫిర్యాదు చేశారు. పట్టణ ఎస్సై జగన్‌మోహన్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా శనివారం విద్యానగర్‌లో నిందితురాలు అంబటి ఉమను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి నుంచి రూ.4.93 లక్షల నగదు, 312.020 గ్రాముల బంగారు వస్తువులు, ఆండ్రాయిడ్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముద్దాయి అంబటి ఉమా వలలో పడి నిడదవోలు చుట్టుపక్కల మరి కొంతమంది కూడా మోసపోయినట్లు తెలిసింది. కేసును ఛేదించిన సీఐ పీవీ తిలక్, ఎస్సై జగన్‌మోహన్‌రావులను కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్ అభినందించారు.
రియల్ ఎస్టేట్ పేరుతో
రూ. 1.30 కోట్లు తీసుకున్న మహి ళ
సొమ్ము అడిగితే అత్యాచారం
కేసు పెడతానని బెదిరింపులు
రూ.4.93 లక్షల నగదు, బంగారం రికవరీ