
జీవనోపాధి కోల్పోయాం
ఆటో కార్మికుల పరిస్థితి ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి అన్న చందంగా మారింది. సీఎం చంద్రబాబునాయుడు ఏకపక్ష నిర్ణయంతో ఆటో కార్మికుల పొట్టకొట్టారని కార్మికులు ధ్వజమెత్తుతున్నారు. రోజంతా కష్టపడి ఆటోను నడుపుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్న కార్మికులు నేడు సీ్త్రశక్తి ఉచిత బస్సు పుణ్యాన అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఒకనాడు దర్జాగా నేను ఆటోవాలాను అని చెప్పుకునే దశ నుంచి నేడు అడుక్కుతినే పరిస్థితి వచ్చిన ఆటో కార్మికులను చూసి ప్రతి ఒక్కరూ జాలిపడుతున్నారు. దీనిపై కథనమిలా..
ఫ రోడ్డున పడిన ఆటోవాలాలు
ఫ పడిపోయిన ఆదాయం
ఫ రోజుకి రూ.500 కూడా రాని వైనం
ఫ జిల్లాలో 21 వేల మందికి పైగా కార్మికులు
ఫ ఎన్నికల వాగ్దానం నిలబెట్టుకోని కూటమి ప్రభుత్వం
పెరవలి: ఆటో నడిస్తేనే జీవనచక్రం తిరిగే కుటుంబాలు నేడు వీధిన పడ్డాయి. ఫైనాన్స్ బకాయిలు కట్టలేక, కుటుంబాలను పోషించుకోలేక, అప్పులు చేయలేక, కడుపునిండా తిండి తినలేక విలవిల్లాడిపోతున్నారు. ఎంతో సాఫీగా సాగే ఆటోవాలాల జీవనం నేడు తెల్లవారితే చాలు ఎలా బతకాలో తెలియక నానా అగచాట్లు పడుతున్నారు. ఒకప్పుడు ఆడుతూ పాడుతూ సాగిపోయిన కుటుంబాలు కాస్తా కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత బస్సు పథకం అష్టకష్టాలు చవిచూపిస్తుంది.
కిరాయిలు లేక, ఆటో ఎక్కే వారు లేక ఏమి చేయాలో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. పదులు, వందలు కాదు ఏకంగా జిల్లాలో 21 వేల మంది కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చంద్రబాబు సర్కారు నిర్ణయంతో ఆటోడ్రైవర్లు ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేసి ఇప్పుడు కిరాయిలు లేక నెలవారీ ఈఎంఐలు కట్టలేక ఆటో కార్మికులు సతమతమవుతున్నారు. ఆర్టీసీలో సీ్త్రశక్తి పేరుతో ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సుతో తాము ఉపాధి కోల్పోతామని.. తమ బతుకులు వీధిన పడతాయి గత 6 నెలలుగా ఉద్యమాలు చేసి నిరసనలు తెల్పినా ప్రభుత్వానికి కనికరం లేదని ధ్వజమెత్తుతున్నారు. ప్రాంతాన్ని బట్టి రోజుకి 5 నుంచి 10 ట్రిప్పులు వేస్తూ రోజుకి చెల్లించవలసిన అద్దెలు కట్టి ఇంటికి రూ.500 నుంచి రూ.800 వరకు తీసుకెళ్లేవారమని నేడు రోజంతా కష్టపడి ఆటో తిప్పినా కనీసం రూ.500 కూడా రావడం లేదని దీనంగా చెబుతున్నారు. ఇంత దుర్భర పరిస్థితి వస్తుందని తాము ఏనాడు ఊహించలేదని వాపోతున్నారు. ఉచిత బస్సుతో జీవనోపాధి కోల్పోతామని తెలిసినా కనీసం సంప్రదించకుండా ఏకపక్షంగా సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ఆటో యూనియన్లు తప్పుపడుతున్నాయి. తగిన విద్యార్హత ఉన్నా ప్రభుత్వ, ప్రెవేట్ రంగాల్లో ఉద్యోగాలు లేక విద్యావంతులు కూడా ఫైనాన్స్‌పై ఆటోలు తీసుకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఉచిత బస్సు ప్రవేశపెట్టిన నాటి నుంచి మహిళలు ఆటోలు ఎక్కడం మానేశారని దీంతో ఉపాధి పోయి ఉసూరుమంటూ రోడ్లపై కాలక్షేపం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, రాజానగరం, కడియం, గోకవరం, రంగంపేట, అనపర్తి, తాళ్లపూడి, పెరవలి, ఉండ్రాజవరం, బిక్కవోలు, కోరుకొండ, దేవరపల్లి మండల కేంద్రాల్లో ఆటోలే జీవనాధారంగా వేలాది కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలన్నీ ఉచిత బస్సు మూలంగా ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన తరువాత ఆటోయూనియన్లు బగ్గున లేచి ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం కనికరం లేకుండా అణచి వేసిందని అంటున్నారు. గత ప్రభుత్వం ఆదుకున్నట్టుగా ఎన్నికల్లో మాకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్న వాగ్దానాన్ని నిలబెట్టుకుని ఆర్థిక భరోసా కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కార్మికులకు వైఎస్సార్ సీపీ పెద్దపీట
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఆటో కార్మికులకు వాహనమిత్ర పథకం ప్రవేశపెట్టి వారి ఉపాధికి భరోసాగా నిలిచింది. ఆటో ఉన్న ప్రతి కార్మికుడికీ ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం చేసి ఆదుకుంది. కోవిడ్ లాంటి కష్ట సమయంలోనూ ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించి అండగా నిలిచింది.

జీవనోపాధి కోల్పోయాం