
పోటెత్తిన భక్తులు
పెరవలి: అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి దర్శనానికి శనివారం వేలాది మంది భక్తులు పోటెత్తారు. స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. శనివారం స్వామి అమ్మవార్లను విశేష అలంకరణ చేయటంతో భక్తులు చూసి పరవశించారు. తెల్లవారుజాము నుంచే వందలాది మంది భక్తులు రావడంతో భక్తులు క్యూలో ఆలయ ప్రాంగణం చుట్టూ నిలబడటంతో దర్శనానికి గంట సమయం పట్టింది. ఆలయానికి వచ్చిన వేలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. భక్తులందరికీ దాతల ఆర్థిక సాయంతో 7 వేల మందికి ఉచిత అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతి శనివారం భక్తులకు దాతల సహకారంతో ఉచిత అన్న సమారాధన నిర్వహిస్తున్నామని తెలిపారు.
22 నుంచి
శరన్నవరాత్రులు ప్రారంభం
సీటీఆర్‌ఐ: స్థానిక దేవీచౌక్‌లో బాలాత్రిపుర సుందరీదేవి 92వ శరన్నవరాత్ర మహోత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబరు 4వ తేదీ వరకు 13 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీదేవి మహోత్సవ సమితి అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు వెల్లడించారు. ఉత్సవ ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నట్టు తెలిపారు. శనివారం స్థానిక దేవి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. రాజరాజేశ్వరరావు మాట్లాడుతూ 21వ తేదీ రాత్రి 9.45 గంటలకు శ్రీదేవి విగ్రహ ప్రతిష్ఠ, 22వ తేదీ ఉదయం 6.18 నిమిషాలకు కలశస్థాపన చేస్తామని తెలిపారు. ప్రతిరోజూ కుంకుమ పూజలు, ఉదయం, సాయంత్రం మంగళవాయిద్యాల నడుమ అఖండ హారతి కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. 28వ తేదీ ఆదివారం 108 దంపతుల పూజ ఉంటుందని, పూజలో పాల్గొన్న వారికి మధ్యాహ్నం భోజన ప్రసాదం అందిస్తామన్నారు. 29వ తేదీన మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీ పూజలు ఉంటాయన్నారు. రోజుకో అలంకారంతో అమ్మవారికి పూజలు, రాత్రివేళ నాటకాలు జరుగుతాయన్నారు. 22న స్వర్ణకవచ కనకదుర్గాదేవిగా, 23న గాయత్రీ దేవిగా, 24న అన్నపూర్ణదేవిగా, 25న మహాలక్ష్మిగా, 26న బాలాత్రిపుర సుందరీదేవిగా, 27న శ్యామలాదేవిగా, 28న లలితాత్రిపుర సుందరీ దేవిగా, 29న సరస్వతీదేవిగా, 30న దుర్గాదేవిగా, అక్టోబరు ఒకటిన మహిషాసురమర్ధినిగా, రెండున విజయదశమి నాడు రాజరాజేశ్వరిగా అలంకరించనున్నారు. అలాగే ప్రతిరోజూ వివిధ నాటకాలు ఉంటాయని ఉత్సవ కమిటీ తెలిపింది. 12వ తేదీ ఆదివారం అన్నసమారాధన నిర్వహిస్తామన్నారు. ఉపాధ్యక్షులు ముత్యాల కుమార రెడ్డి, గంధం భైరవస్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, సెక్రటరీ అల్లక సత్యనారాయణ, కోశాధికారి బత్తుల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు మూడో స్థానం
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని అప్పాలో నిర్వహించిన 7వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్ 2025లో జాతీయ స్థాయిలో జరిగిన ప్రిజన్ హైజీన్ పోటీలో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. ఆ వివరాలను సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ శనివారం తెలిపారు. పురస్కారాన్ని ఆయన హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో స్వీకరించారు. జైళ్లలో పరిశుభ్రత, ఆరోగ్యకర వాతావరణం కల్పించడంతో ఈ స్థానం లభించింది. కేంద్ర కారాగారంలో పనిచేసిన సిబ్బంది సమష్టి కృషిని రాష్ట్ర జైళ్ల శాఖ ఉన్నతాధికారులు అభినందించారని రాహుల్ తెలిపారు. ఈ పురస్కారంతో రాష్ట్ర జైళ్ల శాఖకు గౌరవం చేకూరిందన్నారు.
శృంగార వల్లభుని దర్శనానికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం: మండలంలోని స్వయంభూ శృంగార వల్లభుని ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందుల తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు స్వామి వారిని పూలమాలికలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.