
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
కలెక్టర్ కీర్తి చేకూరి
సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తానని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. శనివారం నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కీర్తి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో తూర్పుగోదావరి జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. రానున్న 2027 గోదావరి మహా పుష్కరాల నేపథ్యంలో ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ, ప్రణాళికతో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అన్ని స్థాయిల్లో పరిపాలనలో బాధ్యతాయుత ధోరణి కనబరచాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ద్వారా అందిస్తున్న సేవలు ప్రజలకు నిజ సమయంలో చేరేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. పీజీఆర్‌ఎస్‌కు సంబంధించి వాస్తవంగా డివిజన్, మండల స్థాయిలో సరైన పరిష్కారం, సరైన అవగాహన లేకే కలెక్టరేట్‌కి ఎక్కువ మంది వస్తున్నారన్నారు. మనందరం కలసికట్టుగా పనిచేసి జిల్లాను అగ్రగామిగా నిలపడంలో సమన్వయం, పరస్పర సహకారంతో కలసి పనిచేద్దామని కలెక్టర్ కోరారు. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ముఖ్యమంత్రి కలెక్టర్ల కాన్ఫరెన్స్ సందర్భంలో జిల్లాకు చెందిన ముఖ్యమైన సమస్యలు, రాష్ట్ర, కేంద్ర స్థాయిలో రావలసిన అనుమతులు, నిధుల మంజూరు తదితర అంశాలపై శాఖల వారీగా చర్చించామని, ఈమేరకు సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అంతకు ముందు కలెక్టరేట్‌కు చేరుకున్న ఆమెకు జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి కలెక్టరేట్ ఏవో ఆలీ, ఆర్డీఓలు రాణీసుస్మిత, ఆర్.కృష్ణనాయక్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు స్వాగతం పలికారు.