
న్యూస్‌రీల్
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలోని సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) ఆధ్వర్యంలో అడ్‌హక్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి చైర్మన్‌గా వరసల రాందాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజమహేంద్రవరంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఆదివారం జిల్లా సచివాలయ ఉద్యోగుల విస్తృత సమావేశం జరిగింది. ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు పి.గిరిప్రసాద్‌వర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమకు సెలవులు లభించడం లేదని, పని ఒత్తిడి విపరీతంగా పెరిగిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాల్సి ఉన్నప్పటికీ, రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేయాల్సి వస్తుందని అన్నారు. వలంటీర్ విధులను బలవంతంగా తమపై రుద్దడం, ఇంటింటా సర్వేల పేరుతో పని ఒత్తిడి పెంచడం సరికాదన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో ఏపీజీఈఏ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ పోరాడుతున్నారన్నారు. జిల్లా అధ్యక్షుడు గిరిప్రసాద్‌వర్మ మాట్లాడుతూ ఉద్యోగులకు అండగా నిలవడానికి ఒక చైతన్యవంతమైన సంఘం అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ముందుకు వచ్చిన సచివాలయ ఉద్యోగులను అభినందించారు. సమావేశంలో సంఘ కన్వీనర్ కోనాల శుభాకర్, కో చైర్మన్ షేక్ గౌసియా బేగం, కోకన్వీనర్ బాల రజని పాల్గొన్నారు.