
సర్వేత్రా వ్యతిరేకత
ఫ సచివాలయ వ్యవస్థపై ‘కూటమి’ కుట్ర
ఫ ఉద్యోగులకు సర్వేల పేరుతో వేధింపులు
ఫ అసలు విధులు పక్కనబెట్టి పనులు
ఫ కొత్తగా మరికొన్ని సర్వేలకు నిర్ణయం
ఫ ప్రభుత్వ తీరుపై నిరసన గళం
సాక్షి, రాజమహేంద్రవరం: సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది.. ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు అందించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ వ్యవస్థను నీరుగార్చుతుంది.. రోజుకో నిర్ణయం తీసుకుంటూ పనిభారం పెంచుతుంది. ఇప్పటికే వలంటీర్లను సాగనంపిన సర్కారు తాజాగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై వేధింపులకు దిగుతుంది. నిర్దేశించిన విధులు కాకుండా అన్ని పనులు సచివాలయ ఉద్యోగులతో చేయిస్తూ మానసిక క్షోభకు గురిచేస్తోంది. జాబ్ చార్ట్‌లో లేని పనులూ చేయిస్తోంది. వివిధ రకాల సర్వేల పేరుతో తిప్పుతుంది. సెలవు రోజుల్లో సైతం తిప్పలు పెడుతోంది.
జిల్లా వ్యాప్తంగా 512 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఇందులో 119 వార్డు, 393 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 5,513 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా, 4,323 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. సచివాలయ ఉద్యోగులను కేవలం సర్వేలకు వినియోగిస్తుండటంతో పౌర సేవలు సక్రమంగా అందడం లేదు. చివరకు మహిళా పోలీసులను సైతం సర్వేలకు తిప్పుతుండటంతో పల్లెల్లో శాంతిభద్రతలు, నాటు సారా తయారీ, విక్రయాలు పెట్రేగిపోయాయి. సచివాలయంలో కీలక పనిచేయాల్సిన డిజిటల్ అసిస్టెంట్లు సైతం సర్వేల్లో భాగస్వామ్యం అవుతుండటంతో ప్రజా సేవలకు ఆటంకం కలుగుతుంది. ప్రజలు కార్యాలయాలకు రావడం.. తిరిగి వెళ్లడం పరిపాటిగా మారుతుంది. అగ్రికల్చర్ అసిస్టెంట్లు పొలంబడి వదిలేసి గ్రామాల బాట పడుతున్నారు.
నిత్యం.. సర్వేలతో సతమతం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై వేధింపుల పర్వం మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో వలంటీర్లు చేపట్టిన పనులన్నీ ఉద్యోగులతో చేయిస్తుంది. ప్రతి నెలా ఇంటి వద్దకే పింఛన్లు అందజేస్తున్నామని గొప్పలు చెప్పుకొనేందుకు, వీటిని సచివాలయ ఉద్యోగుల ద్వారా అందిస్తుంది. జాబ్‌చార్ట్‌కు విరుద్ధంగా పనులు అప్పగిస్తుంది. 36 రకాలకు పైగా సర్వేలకు ఉద్యోగులను వినియోగిస్తుందంటే ఏ స్థాయిలో వేధిస్తుందో ఇట్టే అర్థం అవుతోంది. ప్రతి నెలా మొదటి తారీఖున ఉదయం 4 గంటల నుంచి ప్రతి ఇంటికీ వెళ్లి పింఛన్ల పంపిణీ చేపట్టాల్సి వస్తోంది. ఇది మంచిదే అయినా మిగిలిన వాటిపైనా ఉద్యోగులను ఇబ్బందులు పెడుతోంది. ఓడీఎఫ్ సర్వేలో భాగంగా మురుగుదొడ్ల ఫొటోలు తీసే బాధ్యతలు సైతం సచివాలయ ఉద్యోగులకే అప్పగించింది. ఆర్‌డబ్ల్యూఎస్ పల్స్ సర్వేలో కుళాయిలు ఫొటోలు సైతం తీయిస్తుంది. ఉదయం 6 గంటలకు పారిశుధ్య తీరును పరిశీలించాల్సి ఉంది. 100 రోజుల హౌస్ హోల్డ్ సర్వే, ఇంటింటికీ స్టిక్కర్లు అతికించి కరపత్రాలు పంపిణీ చేసే విధులు, విజన్ 2047 పేరుతో సర్వే చేయిస్తుంది. హౌస్ టు హౌస్ జియో ట్యాగింగ్, ఎంఎస్‌ఎంఈ సర్వే, ప్రజా ఫిర్యాదులపై వెరిఫికేషన్ (పీఆర్‌ఎస్) సర్వే, ఎన్‌పీసీఐ లింక్ (బ్యాంక్ లింక్) వంటి కార్యక్రమాలన్నీ సచివాలయ ఉద్యోగులే చేపడుతున్నారు. వార్డు పరిపాలన కార్యదర్శులకు ఒకవైపు హౌస్ జియో ట్యాగింగ్, మరోవైపు ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల చేయాలని లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు. ఈ–వసూళ్లను పెంచాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. వెల్ఫేర్ సెక్రటరీలకు ఎన్‌పీసీఐ (బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియ) విధులు కేటాయిస్తున్నారు. అనుకున్న సమయంలో పూర్తికాకపోతే మెమోలు జారీ చేస్తున్నారు.
విగిసిపోయి విధుల బహిష్కరణ
సచివాలయ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో నిరసన బాట పట్టారు. గతంలో వలంటీర్లు ఒక క్లస్టర్‌కు పరిమితమై విధులు నిర్వర్తించేవారు. ప్రస్తుతం అలా కాకుండా సచివాలయ ఉద్యోగులకు ఒకటి కంటే ఎక్కువ క్లస్టర్లకు మ్యాపింగ్ చేశారు. బలవంతంగా ఇంటింటికీ తిరిగే విధులు అప్పగిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా శనివారం నుంచి ప్రభుత్వం ఆర్భాటంగా చెబుతున్న వాట్సాప్ గవర్నెన్స్‌కు సంబంధించి ప్రతి ఇంటికీ వెళ్లి అవగాహన కల్పించి.. దగ్గరుండి వాట్సాప్ సర్వీసులు పొందేలా ప్రజలపై బలవంతం చేయాలన్న ఆదేశాలు వచ్చాయి. ఈ విషయమై సచివాలయ ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక పిలుపు మేరకు నిరసనకు దిగారు. మనమిత్ర డోర్ టు డోర్ సర్వే, క్లస్టర్ మ్యాపింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. శనివారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.
తాజాగా మరికొన్ని..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రస్తుతం నిర్వహిస్తున్న సర్వేలు చాలదన్నట్లు కొత్త సర్వేలు తీసుకు వస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పీ–4 సర్వే చేపడుతున్నారు. కొత్తగా మిస్సింగ్ సిటిజన్స్ సర్వే, మిస్సింగ్ ఎంప్లాయీస్ సర్వే, వర్క్ ఫ్రమ్ హోం, హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్, డెత్ రీ వెరిఫికేషన్ సర్వే, 0–6 ఏళ్ల పిల్లల ఆధార్ మిస్సింగ్ సర్వే, నాన రెసిడెన్స్ సర్వే, ఇంటి, కుళాయి పన్నుల వసూళ్లు, సామిత్వ, మనమిత్ర సర్వే, కౌసల్య, అన్నదాత సుఖీభవ సర్వే, ఈ–పంట నమోదు చేయిస్తుంది.
గతమెంతో ఘనం
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు అన్ని రకాల సేవలు అందేవి. 35 శాఖలకు సంబంధించిన 500 రకాల సేవలు ప్రజలకు చేరువయ్యాయి. ప్రధానంగా పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు, సివిల్ పనులు, వైద్యం, ఆరోగ్యం, రెవెన్యూ సమస్యలు, భూముల సర్వే, శిశు సంక్షేమం, డెయిరీ, ఫౌల్ట్రీ లాంటి సేవలు సచివాలయం నుంచే అందించేవారు. ప్రస్తుతం ఆయా శాఖల కార్యాలయాల వద్దకు పరుగులు తీయాల్సి వస్తోంది. అప్పట్లో అర్జీ పెట్టుకున్న 72 గంటల్లోనే సమస్య పరిష్కారం అయ్యేది. ప్రస్తుతం జిల్లా కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లో నిర్వహించే గ్రీవెన్స్‌కు వెళ్లాల్సి వస్తోంది.

సర్వేత్రా వ్యతిరేకత