
కిడ్నీ బాధితుడికి రూ.1.61 లక్షల ఆర్థిక సాయం
పెదపూడి: కిడ్నీ బాధితుడికి వైద్య ఖర్చుల కోసం సంపర ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు రూ.1,61,162 ఆర్థిక సాయం అందజేశారు. ఆ అసోసియేషన్ ఫౌండర్ కం చైర్మన్ వడ్డి వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. సంపర గ్రామానికి చెందిన చల్లపల్లి నాగేశ్వరరావు బతుకుతెరువు కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లి, అక్కడ ఓ అపార్టుమెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అతడి కుమారుడు చల్లపల్లి సతీష్‌కు కేవలం 20 ఏళ్ల వయసులోనే రెండు కిడ్నీలు పాడై, వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో నాగేశ్వరరావు ఆర్థిక సాయం కోసం తమ సొంత ఊరు సంపరలోని ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులను ఆశ్రయించాడు. స్పందించిన సభ్యులు రూ.1,61,162 సేకరించి కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోషన్ చేతుల మీదుగా శనివారం మధ్యాహ్నం నాగేశ్వరరావుకు అందజేశారు. అలాగే కలెక్టర్ షణ్మోషన్.. సంపర అసోసియేషన్ కార్యక్రమాలను పరిశీలించి, అభినందించి బాధితుడి తండ్రికి మరో రూ.10 వేలు తన సొంత సొమ్ములు అందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు కుందూరి వెంకట సుబ్బారావు కొమ్మన శ్రీనివాసరావు, యానాల మౌళి తదితరులు పాల్గొన్నారు.