చేతికందని కష్టం | - | Sakshi
Sakshi News home page

చేతికందని కష్టం

Sep 7 2025 7:40 AM | Updated on Sep 7 2025 7:40 AM

చేతిక

చేతికందని కష్టం

కంద రైతుకు కన్నీళ్లు

ధర పతనంతో కుదేలైన వైనం

గత ఏడాది పుట్టు ధర రూ.11 వేలు

నేడు రూ.6 వేలకు

పడిపోవడంతో ఆవేదన

ఎకరానికి సుమారు

రూ.2.25 లక్షల నష్టం

పెరవలి: జిల్లాలో కంద సాగు చేస్తున్న రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. గత కొన్నేళ్లుగా లాభాల బాట పట్టిన రైతులు.. నేడు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. దిగుబడి బాగున్నా మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించకపోవడంతో నష్టాలు తప్పడం లేదు. వెరసి.. రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్టులో పుట్టు (232 కిలోలు) కంద ధర రూ.6 వేలు మాత్రమే ఉండడంతో దిగుబడి (ఊరిక) బట్టి ఎకరానికి రూ.1.05 లక్షల నుంచి రూ.2.25 లక్షలు నష్టపోవాల్సి వస్తోంది.

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో..

గత వైఎస్సార్‌ ప్రభుత్వంలో కంద రైతులు స్వర్ణయుగాన్ని సరి చూశారు. ఆనాడు గిట్టుబాటు ధర చరిత్ర సృష్టించింది. పుట్టు కంద రూ.11 వరకూ పలికింది. దీంతో రైతుల ఆదాయం బాగుండేది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. కంద ధర పతనం కావడంతో రైతులు కుదేలవుతున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది దిగుబడులు పెరిగినా, ధరలు లేకపోవడంతో పెట్టుబడి కూడా రావడం లేదు. జిల్లాలోని 1,450 హెక్టార్లలో సుమారు ఆరు వేల మంది రైతులు కంద పంటను సాగు చేస్తుండగా, దానిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మంది ఆధారపడి ఉన్నారు. ప్రస్తుతం ఎకరానికి 50 నుంచి 70 పుట్టుల దిగుబడి వస్తోంది. ధర లేకపోవడంతో ఎకరానికి సుమారు రూ.2.25 లక్షల వరకు నష్టం రావటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

సాగు విస్తీర్ణం

జిల్లాలో కంద పంట విస్తీర్ణం గత ఏడాది కంటే ఈసారి ఎక్కువైంది. గత ఏడాది ఎవరూ ఊహించని విధంగా పుట్టు కంద ధర రూ.11 వేలు పలకడం దీనికి కారణం. పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, పోలవరం, కడియం, అనపర్తి, రాజమహేంద్రవరం రూరల్‌, బిక్కవోలు మండలాల్లో గత ఏడాది 1,050 హెక్టార్లలో సాగు చేస్తే, ఈ ఏడాది 1,450 హెక్టార్లకు పెరిగింది. గతంలో ఈ పంట లాభాలు తీసుకురావటంతో ఈ ఏడాది రైతులు పంట విస్తీర్ణం పెంచారు. దీంతో దిగుబడి పెరిగి, నష్టాల బాట పట్టారు.

ధర పతనం

రైతులు ఊహించని విధంగా కంద ధర ఈ ఏడాది రూ.7 వేల నుంచి ప్రారంభమై ప్రస్తుతం రూ.6 వేలకు దిగిపోయింది. గతేడాది ఇదే సమయంలో పుట్టు ధర రూ.11 వేలు ఉండగా, నేడు రూ.6 వేలకు పడిపోయింది. కంద పంట వేసినప్పుడు పుట్టు విత్తనాన్ని రూ.11 వేలకు కొనుగోలు చేయగా ఇప్పుడు మార్కెట్‌లో పుట్టు ధర రూ.6 వేలు ఉండడంతో దిగుబడి పెరిగినా రైతులకు తీవ్ర నష్టాలు వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో 50 పుట్టులకు రూ.3 లక్షలు, 60 పుట్టులకు రూ.3.60 లక్షలు, 70 పుట్టులు ఊరిక ఉంటే రూ.4.20 లక్షలు వస్తోంది

దిగుబడి పెరిగినా..

గత ఏడాది ఎకరానికి 50 నుంచి 60 పుట్టుల దిగుబడి వస్తే ఈ ఏడాది అది 60 నుంచి 70 పుట్టులకు పెరిగింది. కానీ ధరలు సగానికి సగం తగ్గిపోవడంతో నష్టాలు వచ్చాయి. అంతే కాకుండా గత ఏడాది లాగే ఈ ఏడాది గిట్టుబాటు ధర లభిస్తుందనే రైతులు ఆలోచించారు. దీంతో సాగు విస్తీర్ణం జిల్లాలో మరో 500 హెక్టార్లు పెరిగింది. కానీ ధర పతనం కావడంతో కంద రైతులు కుదేలయ్యారు.

నష్టాల పాలవుతున్నాం

ఆరుగాలం శ్రమించి పండించిన కంద పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో నష్టాలపాలవుతున్నాం. ఎకరానికి పెట్టుబడి పోను రూ.ఒక లక్షపైనే మిగులుతుందనుకుంటే.. నేడు ఒక ఎకరానికి రూ.1.05 లక్షలు నష్టం వచ్చింది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో పుట్టు ధర రూ.11 వేలు పలికితే నేడు రూ.6 వేలు మాత్రమే ఉంది.

– దిడ్ల సంపతిరావు, రైతు, ఖండవల్లి

పెట్టుబడి కూడా రాదు

గత ఐదేళ్లూ లాభాలను చూసిన మేము.. ఇప్పుడు పెట్టుబడి కూడా రాని పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. గతంలో చాలా ఆశాజనకంగా పంట ఉండేది. పుట్టు ధర పతకం కావడంతో నేడు ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇలాగైతే వ్యవసాయం ఎలా చేయాలో తెలియడం లేదు.

– బొలిశెట్టి వెంకటేశ్వరరావు,

కంద రైతు, అన్నవరప్పాడు

పెరిగిన సాగు విస్తీర్ణం

ఉభయ గోదావరి జిలాల్లో పండించిన కందకు చైన్నె, ముంబై మార్కెట్లలో మంచి డిమాండ్‌ ఉంది. కానీ ఈ ఏడాది కంద సాగు విస్తారంగా పెరగటం, మార్కెట్‌లో వినియోగం తగ్గడంతో ధరలు దిగిపోయాయి. అన్ని జిల్లాల్లో కంద దిగుబడులు బాగుండటం కూడా మరో కారణం.

– గడుగొయ్యిల సత్యనారాయణ,

కంద వ్యాపారి

రూ.లక్షల్లో పెట్టుబడి

కంద సాగుకు కోసం రైతులు రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఒక ఎకరంలో ఈ పంటను సాగు చేయాలంటే 30 పుట్టుల విత్తనం వేయాలి. గత ఏడాది విత్తనం పుట్టును రూ.11 వేలు చొప్పున 30 పుట్టులకు రూ.3.30 లక్షలు, చేను దుక్కు దున్నటానికి, కంద నాటడానికి, బోదెలు తవ్వటానికి, చచ్చు ఎక్కవేయటానికి కూలీలకు రూ.ఒక లక్ష, పెంట వేయటానికి రూ.30 వేలు, ఎరువులు, పురుగు మందులకు రూ.40 వేలు, నీటి తడులు, కలుపుతీతకు రూ.25 వేలు.. కలిసి దాదాపు రూ.5.25 లక్షల పెట్టుబడి అవుతోంది. ఇక దిగుబడి ఎకరానికి 50 పుట్టులు ఉంటే ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం ప్రకారం పుట్టు (232 కిలోలు) కంద ధర రూ.6 వేల చొప్పున 50 పుట్టులకు రూ.3 లక్షలు మాత్రమే వస్తోంది. 60 పుట్టులు ఉంటే రూ. 3.60 లక్షలు, 70 పుట్టులు దిగుబడులు ఉంటే రూ.4.25 లక్షలు మాత్రమే వస్తోంది. అంటే పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడింది.

ఇతర రాష్ట్రాల్లో పెరిగిన సాగు

గతంలో ఇతర రాష్ట్రాల్లో కంద సాగు చేసినా ఆంధ్రా కందకు మంచి డిమాండ్‌ ఉండేది. కానీ బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కంద సాగు విస్తీర్ణం పెరగటం, మన కంటే అక్కడ తక్కువ ధరకు అక్కడ లభించడంతో ఎగుమతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో ధరలు కూడా పతనమయ్యాయి.

చేతికందని కష్టం1
1/5

చేతికందని కష్టం

చేతికందని కష్టం2
2/5

చేతికందని కష్టం

చేతికందని కష్టం3
3/5

చేతికందని కష్టం

చేతికందని కష్టం4
4/5

చేతికందని కష్టం

చేతికందని కష్టం5
5/5

చేతికందని కష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement