
యూటీఎఫ్ రణభేరి పోస్టర్ ఆవిష్కరణ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రభుత్వ విద్యారంగంతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15 నుంచి 19 వరకు యూటీఎఫ్ రణభేరి జాతా చేపట్టనుంది. ఈ కార్యక్రమ పోస్టర్‌ను శనివారం యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆవిష్కరించింది. రాజమహేంద్రవరంలోని యూటీఎఫ్ హోంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జయకర్, ఎ.షరీఫ్, రాష్ట్ర కార్యదర్శి ఎన్.అరుణ కుమారి నేతృత్వంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదు ప్రాంతాల నుంచి రణభేరి జాతాలు మొదలవుతాయని, ఐదు రోజుల పాటు అన్ని ప్రాంతాల్లో ఇవి పర్యటిస్తాయన్నారు. ప్రభుత్వ విధానాలు విద్యా వ్యవస్థను అధోగతి పాలు చేస్తున్నాయన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు చెల్లిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం.. 15 నెలలు కావస్తున్నా వాటి ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 5న విజయవాడలో భారీ రణభేరి సదస్సు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షురాలు ఎం.విజయ గౌరీ, జిల్లా కార్యదర్శులు రవిబాబు, దయానిధి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రూపస్‌రావు, జిల్లా కార్యవర్గం శ్రీనుబాబు, శ్రీనివాసరావు, విజయ్ బాబు, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.