
జేసీగా చిన్నరాముడు సేవలు అభినందనీయం
● కొనియాడిన కలెక్టర్ ప్రశాంతి
● కలెక్టరేట్‌లో సత్కారం
రాజమహేంద్రవరం సిటీ: జాయింట్ కలెక్టర్‌గా చిన్నరాముడు జిల్లాకు అందించిన సేవలు అభినందనీయమని కలెక్టర్ పి.ప్రశాంతి కొనియాడారు. బదిలీపై వెళుతున్న ఆయనను శనివారం కలెక్టరేట్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికార హోదాలో ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా మానవత్వం విషయంలో మృధు స్వభావం కలిగి ఉండడం చిన్న రాముడి ప్రత్యేకత అన్నారు. కొత్త విషయాలు నేర్చుకోవడం ఆయనకు పనిపై ఉన్న మక్కువకు నిదర్శనమన్నారు. జిల్లాలో పనిచేసిన ఏడాది కాలంలో యోగాంధ్ర, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారన్నారు. విధి నిర్వహణలో ఎల్లప్పుడూ సానుకూల ధృక్పథంతో వ్యవహరించారని, కొన్నిసార్లు వేచి చూసే ధోరణి వల్ల మెరుగైన ఫలితాలు సాధించారని తెలిపారు. నూతన జాయింట్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్ మాట్లాడుతూ చిన్న రాముడు మంచి మనసున్న వ్యక్తిగా అందరిలోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారన్నారు. చిన్న రాముడు మాట్లాడుతూ ఈ ఏడాది కాలం తనకు గుర్తుండిపోయే తీపి జ్ఞాపకం అన్నారు. రెవెన్యూ అనుబంధ, ఇతర ప్రభుత్వ శాఖల పనితీరు మెరుగుపడటానికి తన వంతు కృషి చేశానన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి, ఆర్డీవోలు ఆర్.కృష్ణ నాయక్, రాణి సుస్మిత, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు, కేఆర్‌సీసీ ఎస్డీసీ కె.భాస్కర్ రెడ్డి, డీఎస్‌వో వి.పార్వతి పాల్గొన్నారు.