
వాట్సాప్ స్టేటస్ పెట్టి జేఎన్‌టీయూకే అధ్యాపకుడి ఆత్మహత్య
కుటుంబ కలహాలే కారణం
భార్య, ఆమె బంధువులైన కూటమి నేతల ఒత్తిడితో పోలీసుల కౌన్సెలింగ్
కాకినాడ జిల్లా: మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అతడు కష్టపడి ఉన్నత చదువులు చదివాడు. అధ్యాపకుడిగా జీవితంలో స్థిరపడ్డాడు. అయితే కుటుంబ కలహాలు, కూటమి నేతల ఒత్తిడి మేరకు పోలీసుల చేసిన కౌన్సెలింగ్‌తో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. తొండంగి మండలం రావికంపాడుకు చెందిన మట్ల గంగారావు, గంగమ్మ దంపతుల కుమారుడు మట్ల శ్రీనివాస్ (35) జేఎన్‌టీయూకేలో కాంట్రాక్టు అధ్యాపకుడిగా 13 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు. అతడికి సుమారు 12 ఏళ్ల క్రితం వివాహం కాగా, భార్య దివ్యతో కలిసి కాకినాడలో నివాసం ఉంటున్నాడు. వీరికి గంగ సాన్విత, సాయి గంగాధర అవినాష్ అనే పిల్లలు ఉన్నారు. కాగా.. కొంత కాలంగా శ్రీనివాస్‌కు అతడి భార్యతో మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఆమె తన బంధువులైన కూటమి నేతల ఒత్తిడితో నాలుగు రోజుల క్రితం అన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శ్రీనివాస్‌ను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు.
మనస్తాపంతో..
ఈ ఘటనతో మనస్తాపం చెందిన శ్రీనివాస్ శుక్రవారం తన స్వగ్రామమైన రావికంపాడుకు వచ్చాడు. తల్లిదండ్రులతో మాట్లాడిన అనంతరం బయటకు వచ్చి స్థానిక రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముందుగా తన ఆత్మహత్యకు వీరే కారణమంటూ కొందరి పేర్లను ప్రస్తావించాడు. అలాగే నన్ను క్షమించండి అంటూ పిల్లల పేర్లు, అమ్మ నాన్న అని టైప్ చేసి వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో సంచలనమైంది. కాగా.. రైల్వేట్రాక్‌పై శ్రీనివాస్ మృతదేహాన్ని శనివారం గుర్తించామని, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు తుని రైల్వే ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు. మృతుడి తండ్రి గంగారావు వికలాంగుడు, తల్లి కీళ్ల వ్యాధితో నడవలేని స్థితిలో ఉంది. ఈ పరిస్థితిలో కుమారుడిని పోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.