
వాటర్ ట్యాంక్ కూలి తల్లి, కుమారుడు మృతి
మాడుగులపల్లి మండల కేంద్రంలో విషాధచాయలు
నల్గొండ జిల్లా: తెల్లారితే కేఫ్ ఓపెనింగ్.. అందుకోసం కేఫ్ నిర్వాహకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక రోజు ముందుగాను కేఫ్ వద్దకు చేరుకుని ఏర్పాట్లు చేసుకుని రాత్రి అక్కడే నిద్రించారు. తెల్ల వారుజామున కేఫ్ పైకప్పుపై ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ కూలి కేఫ్ నిర్వాహకుడి భార్య, కుమారుడు మృతిచెందారు. ఈ ఘటన చిట్యాల మండల పరిధిలోని పెద్దకాపర్తి శివారులో జరగగా.. మృతుల స్వస్థలం మాడుగులపల్లి మండల కేంద్రం కావడంతో స్థానికంగా విషాధచాయలు అలుముకున్నాయి.
వివరాలు.. మాడుగులపల్లి మండల కేంద్రానికి చెందిన తగుళ్ల వెంకన్న, నాగమణి(30) దంపతులకు కుమారుడు విరాట్‡కృష్ణ(7), కుమార్తె నందిని సంతానం. వెంకన్న రైల్వే శాఖలో గ్యాంగ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. వీరు ఆర్ధికంగా ఉన్నతంగా బతకాలన్న ఉద్ధేశంతో చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నూతనంగా కేఫ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆదివారం కేఫ్ ప్రారంభించాలని అనుకుని శనివారం రాత్రి కుటుంబ సభ్యులందరూ కలిసి కేఫ్ వద్దకు వెళ్లి రాత్రి అక్కడే నిద్రించారు. ఆదివారం తెల్లవారుజామున వెంకన్న నిద్రలేచి పనులు చేసుకుంటున్నాడు. అదే సమయంలో కేఫ్ రేకుల పైన ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ట్యాంక్ అక్కడే నిద్రిస్తున్న వెంకన్న కుటుంబ సభ్యులపై పడిపోయింది.
వెంకన్న వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా అతడి భార్య నాగమణి(30), కుమారుడు విరాట్‡కృçష్ణ(7) అప్పటికే మృతిచెందారు. అతడి కుమార్తె కూతురు నందిని, తల్లి పార్వతమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. పార్వతమ్మను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన నాగమణి, విరాట్ కృష్ణకు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గ్రామానికి చేరుకున్న మృతదేహాలను స్థానికులు సందర్శించి కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం నాగమణి, విరాట్ కృష్ణ మృతదేహాలకు మాడుగులపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు.
నేత్రదానం..
నాగమణి, విరాట్ కృష్ణ నేత్రాలను దానం చేసేందుకు గాను ఐ డొనేషన్ సెంటర్ వారు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులను అవగాహన కల్పించగా.. వారు ఒప్పుకున్నారు. దీంతో నాగమణి, విరాట్ కృష్ణ కంటి కార్నియాను టెక్నీషియన్ బచ్చలకూరి జాని సేకరించారు.