
ఐవీఎఫ్, సరోగసీ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వరరావు
రాజమహేంద్రవరం రూరల్: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చట్టాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలోని ఏఆర్టీ/ఐవీఎఫ్ సెంటర్లు, సరోగసీ కేంద్రాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. అనుమతి లేకుండా ఎటువంటి చికిత్సా కేంద్రాలు నడపరాదన్నారు. నియామావళి ప్రకారమే సేవలు అందించాలన్నారు. తల్లిదండ్రుల కలలను నెరవేర్చడంలో ఏఆర్టీ, ఐవీఎఫ్, సరోగసీ ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రజలు తప్పనిసరిగా ప్రభుత్వం గుర్తించిన, రిజిస్ట్రేషన్ కలిగిన ఆస్పత్రులు/కేంద్రాల్లోనే చికిత్స పొందాలన్నారు. అనుమతి లేని కేంద్రాల్లో చికిత్స చేయించుకోవడం వల్ల ప్రమాదాలు, మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. ప్రజలు ఆయా విషయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనధికార/నమోదు కాని కేంద్రాల్లో చికిత్స చేయించుకోవద్దని సూచించారు. ఏఆర్టీ లేదా సరోగసీ ద్వారా పుట్టిన పిల్లలు దంపతుల చట్టబద్ధ సంతానం అవుతారని స్పష్టం చేశారు. వాణిజ్య సరోగసీ (డబ్బు కోసం) పూర్తిగా నిషేధించబడిందన్నారు. లింగ నిర్ధారణ, గర్భకణాల అమ్మకాలు కఠినంగా నిషేధించబడ్డాయని తెలిపారు. చట్ట ఉల్లంఘన చేసిన వారికి జైలుశిక్ష, భారీ జరిమానాలు ఉంటాయని హెచ్చరించారు. చట్టాల అమలుతో పారదర్శకత, న్యాయం, రక్షణ అన్నీ సాధ్యమవుతాయన్నారు. ప్రజలంతా అవగాహనతో ఉండి, నిబంధనలు పాటించే కేంద్రాలను మాత్రమే ఆశ్రయించాలన్నారు. చట్టాన్ని ఉల్లంఘించినట్టు తెలిస్తే వెంటనే జిల్లా వైద్యారోగ్య శాఖకు సమాచారం అందించాలని కోరారు. ఇతర వివరాలకు 81255 67830 నంబరులో సంప్రదించాలన్నారు.