
వివాదాస్పద ఫ్లెక్సీలపై చర్యలకు డిమాండ్
పోలీస్ స్టేషన్ వద్ద దళితుల ఆందోళన
మామిడికుదురు: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలు దళిత సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. అప్పనపల్లిలో వివాదాస్పద ఫ్లెక్సీ ఏర్పాటు నేపథ్యంలో బుధవారం నగరం పోలీస్ స్టేషన్ వద్ద వారు ఆందోళన నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, సినీ నటుల అభిమాన సంఘాలు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల్లో నాయకులు, హీరోల పేర్లలో బాబు సీమ, కల్యాణ్ సీమ అని అన్వయించుకోవడం వివాదాలకు కారణమవుతోందన్నారు. ఈ వ్యాఖ్యలు కొన్ని కులాలను కించపర్చేలా, రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా ఫ్లెక్సీలు ప్రింటింగ్ చేస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్సై ఎ.చైతన్యకుమార్, తహసీల్దార్ పి.సునీల్‌కుమార్‌కు వినతిపత్రాలు ఇచ్చారు. అంబేడ్కర్ యువజన సంక్షేమ సంఘం, ఎమార్పీఎస్, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కుల విద్వేషాలను రెచ్చగొట్టొద్దు: సీపీఎం
అమలాపురం టౌన్: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా మామిడికుదురు మండలం అప్పనపల్లిలో కులవిద్వేషాలను రెచ్చగొట్టేలా ఫ్లెక్సీ పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక జిల్లా సీపీఎం కార్యాలయంలో పార్టీ నాయకులు బుధవారం సమావేశమై దీనిపై చర్చించారు. ఈ ఫ్లెక్సీ వేయించిన వారిపై, ముద్రించిన షాపుపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరారు. పార్టీ నాయకులు జి.దుర్గాప్రసాద్, పీతల రామచంద్రరావు, జిల్లా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కన్వీనర్ శెట్టిబత్తుల తులసీరావు తదితరులు పాల్గొన్నారు.