
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
దేవరపల్లి: వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. మండలంలోని కృష్ణంపాలెం వద్ద గుండుగొలను–కొవ్వూరు జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా మేజిక్ డ్రైవర్ నాని(28) మృతి చెందగా, వాహనంలో ఉన్న ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం గోపాలపురం ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. కృష్ణంపాలెం వద్ద ముందు వెళుతున్న లారీని కంటైనర్ ఢీకొంది. అదే సమయంలో డ్యాన్సర్లతో వస్తున్న టాటా మేజిక్ వెనుక నుంచి కంటైనర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం అజ్జరానికి చెందిన డైవర్ నాని(28) మృతి చెందగా, డ్యాన్సర్లు చరణ్ ఢిల్లీరావు, హరిసంతోష్, కరిష్మా తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నం నుంచి నెల్లూరుకు ప్రోగ్రాం కోసం 8 మంది వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు నాని కూడా డ్యాన్సరేనని కుటుంబ సభ్యులు తెలిపారు. అతడికి ఇటీవల నిశ్చితార్థమైంది. రెండు నెలల్లో వివాహం కావాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం గోపాలపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు.
కుమార్తెను చూసేందుకు వెళ్తూ..
అయినవిల్లి: సడన్ బ్రేక్ వేయడంతో ఆటో తిరగబడిన ప్రమాదంలో ప్రయాణికుడు మృతి చెందాడు. ఎస్సై హరికోటిశాస్త్రి వివరాల ప్రకారం, బుధవారం చింతనలంక చిన రామాలయం వీధికి చెందిన గోసంగి తనుకులు(75) ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలోని తన కుమార్తెను చూసేందుకు బయలుదేరాడు. ముక్తేశ్వరంలో ఆటో ఎక్కి అమలాపురం వెళ్తుండగా, రావిగుంట చెరువు వద్ద ఆటోడ్రైవర్ అతివేగంగా వెళ్తూ సడన్ బ్రేక్ వేశాడు. ఆటో బోల్తా పడడంతో తనుకులు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అతడి కుమారుడు అంజికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
వర్షంలో ప్రయాణిస్తూ..
అమలాపురం టౌన్: కిమ్స్ ఆస్పత్రి సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వడ్రంగి మేసీ్త్ర మరణించాడు. పట్టణ ఎస్సై ఎన్‌ఆర్ కిషోర్‌బాబు వివరాల మేరకు, అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి గ్రామానికి చెందిన వడ్రంగి మేసీ్త్ర గోడ ఫణికుమార్(32) వర్షం కురుస్తున్న సమయంలో స్కూటీపై వెళుతున్నాడు. అమలాపురం వైపు వస్తున్న ట్రాక్టర్ అతడిని వెనుక నుంచి ఢీకొంది. మరో బైకిస్ట్‌ను కూడా ట్రాక్టర్ ఢీకొట్టడంతో అతనూ గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఫణికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కిషోర్‌బాబు తెలిపారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి