
స్ప్రేయర్ మొరాయిస్తే.. ఫియరే..!
రాయవరం: పంటలకు ఆశించిన చీడపీడల నివారణకు మందులు పిచికారీ చేయడానికి రైతులు రకరకాల స్ప్రేయర్లను వినియోగిస్తుంటారు. ప్రస్తుతం ఖరీఫ్ పంటలకు ఆశిస్తున్న తెగుళ్ల నివారణకు పురుగు మందులను పిచికారీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. పంట కాలంలో వాటితో పని ముగియగానే అలాగే వదిలేస్తారు. తర్వాత పంట కాలంలో అవసరం రాగానే స్ప్రేయర్లను మళ్లీ వినియోగించేందుకు యత్నిస్తే.. చాలావరకు మొరాయిస్తుంటాయి. అప్పుడు స్ప్రేయర్లను తీసుకుని మెకానిక్ షెడ్లకు పరుగులు పెట్టడం సర్వసాధారణం. డబ్బు వెచ్చించి రిపేరు చేయించడం కన్నా, చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వృథా ఖర్చులు తగ్గడంతో పాటు, స్ప్రేయర్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. ప్రస్తుతం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కాండం తొలుచు పురుగు ఆశించడంతో రైతులంతా పురుగు మందుల పిచికారీలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో స్ప్రేయర్లను భద్రపర్చే విధానాన్ని మండల వ్యవసాయాధికారి కేవీఎన్ రమేష్‌కుమార్ వివరించారు.
పవర్ స్ప్రేయర్
మందుల పిచికారీ సమయం ముగియగానే మంచి నీటితో శుభ్రం చేయాలి. ట్యాంకులో పెట్రోలు లేకుండా చూసుకోవాలి. టర్బోరేటర్ గిన్నెలోనూ పెట్రోలు లేకుండా చూడాలి. ప్లగ్ తీసి శుభ్రంగా పెట్రోల్‌తో కడగాలి. పిస్టన్‌పై 5–6 చుక్కల ఇంజినాయిల్ వేసి ప్లగ్‌ను బిగించాలి. ఇలా చేస్తే పిస్టన్ పాడైపోకుండా ఉంటుంది. మళ్లీ అవసరం వచ్చినప్పుడు వెంటనే స్టార్ట్ అవుతుంది.
తైవాన్
ట్యాంకులో ఐదు లీటర్ల మంచినీరు పోయాలి. ఇంజిన్ స్టార్ట్ చేసి నాజిల్ ద్వారా బయటకు పంపాలి. ఇలా చేయడం వల్ల పైపుతో పాటు, నాజిల్‌లో మలినాలు లేకుండా శుభ్రమవుతుంది. ట్యాంకులో పెట్రోలు లేకుండా తీయాలి. ప్లగ్‌ను తీసి పిస్టన్‌పై ఐదారు చుక్కల ఇంజినాయిల్ వేసి ప్లగ్ బిగించాలి. పంపు భాగాలన్నింటినీ శుభ్రంగా తుడిచి భద్రపర్చుకోవాలి.
రీచార్జబుల్..
పనులు పూర్తయిన వెంటనే మూడు లీటర్ల నీటిని ట్యాంకులో పోసి బయటకు పంపాలి. ప్రతి 15 రోజులకు ఓసారి గంట పాటు చార్జింగ్ పెట్టాలి. ఇలా చేయడం వల్ల బ్యాటరీ డ్రెయిన్ కాకుండా ఉంటుంది. అన్నదాతలు ఆయా విషయాలు పాటించి తమ పంపు స్ప్రేయర్లను భద్రపర్చుకోవచ్చు.
ఏడాది తర్వాత తీసినా..
మందుల పిచికారీ పూర్తి కాగానే శుభ్రమైన నాలుగు లీటర్ల మంచినీటిని ట్యాంకులో పోసి నాజిల్ ద్వారా బయటకు పంపాలి. తద్వారా స్ప్రేయర్ గొట్టం(ఇత్తడి) తీసి, దానికి ఇంజినాయిల్ పోసి మళ్లీ బిగించాలి. ఇలా చేస్తే గొట్టం తుప్పు పట్టకుండా ఉంటుంది. బుష్‌లు, రాడ్ల వద్ద ఇంజినాయిల్ పూయడం వల్ల తుప్పు రాకుండా ఉంటుంది. ఏడాది తర్వాత తీసి వాడినా బాగా పనిచేస్తుంది.
హైటెక్..
ట్యాంకులో మూడు లీటర్ల నీటిని పోసి శుభ్రంగా నాజిల్ ద్వారా బయటకు పంపాలి. తర్వాత స్ప్రేయర్ గొట్టం తీసి దానికి ఇంజినాయిల్ పోసి మళ్లీ బిగించాలి. ఇలా చేస్తే గొట్టం తుప్పు పట్టకుండా ఉంటుంది. బుష్‌లు, రాడ్ల వద్ద ఇంజినాయిల్ పూయడం వల్ల తుప్పు పట్టదు.
పరికరాలను భద్రపర్చాలంటున్న
వ్యవసాయ నిపుణులు
నెలల తరబడి వదిలేస్తే..
మొండికేసే అవకాశం
డబ్బు, సమయం వృథా
చిన్న జాగ్రత్తలతో రైతులకు మేలు

స్ప్రేయర్ మొరాయిస్తే.. ఫియరే..!

స్ప్రేయర్ మొరాయిస్తే.. ఫియరే..!

స్ప్రేయర్ మొరాయిస్తే.. ఫియరే..!