
‘ఎంఏ పొలిటికల్ సైన్స్’కు లైన్ క్లియర్
● విద్యార్థుల ఆందోళనతో
దిగొచ్చిన ‘నన్నయ’ అధికారులు
● ఆ గ్రూపును కొనసాగిస్తామని ప్రకటన
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎంఏ పొలిటికల్ సైన్స్ గ్రూప్‌ను యథాతథంగా కొనసాగించాలంటూ విద్యార్థి సంఘాలు చేస్తున్న ఆందోళనలకు యూనివర్సిటీ అధికారులు దిగివచ్చారు. విద్యార్థుల కోరిక మేరకు ఆ గ్రూప్‌ను కొనసాగిస్తామని తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నన్నయ వర్సిటీని ప్రారంభం నుంచీ ఫాకల్టీ సమస్య వేధిస్తోంది. అరకొరగా ఉన్న ఫ్యాకల్టీలో 80 శాతం మంది అడ్‌హాక్ అధ్యాపకులే. వీరు కూడా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా లేకపోవడంతోనే వివిధ సమస్యలకు కారణమవుతోంది. ఈ క్రమంలో పొలిటికల్ సైన్స్ బోధించే ఇద్దరు అధ్యాపకులకు ఏర్పడిన వివాదం విద్యార్థుల భవితకు శాపంగా మారింది. పొలిటికల్ సైన్స్ బోధించే అధ్యాపకులు లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న 22 మంది విద్యార్థులకు తరగతులు బోధించడం కష్టతరంగా మారింది. దీంతో వారిని యూనివర్సిటీ పరిధిలోని కాకినాడ క్యాంపస్‌కు పంపించాలని యూనివర్సిటీ అధికారులు భావించారు. కానీ దానికి విద్యార్థులు సమ్మతించలేదు. దీంతో ఈ విద్యా సంవత్సరానికి కొత్తగా అడ్మిషన్లు తీసుకోకూడదనే నిర్ణయానికి వచ్చిన యూనివర్సిటీ అధికారులు ఆ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. దీనిని విద్యార్థులు, విద్యార్థి సంఘాలతో పాటు దళిత, ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
అధికారుల ఆదేశాల ప్రతుల దగ్ధం
ఎంఏలో పొలిటికల్ సైన్స్ గ్రూపులో 2025–26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేయవద్దంటూ యూనివర్సిటీ అధికారులు ఇచ్చిన ఆదేశాలపై విద్యార్థులు మండిపడ్డారు. యూనివర్సిటీలో ఏర్పడిన అధ్యాపకుల సమస్యకు పరిష్కారం ఏమిటనే విషయాన్ని ఆలోచించడంతో పాటు పొలిటికల్ సైన్స్ గ్రూపును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ ప్రాంగణంలో బుధవారం ఉదయం ఆందోళనకు దిగారు. ఎంఏ పొలిటికల్ సైన్స్‌లో నూతన ప్రవేశాలు తీసుకోవద్దంటూ యూనివర్సిటీ అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రతులను కాల్చి, బూడిద చేశారు. ఈ మేరకు రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఆ ప్రచారంలో నిజం లేదు
యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎంఏ పొలిటికల్ సైన్స్ గ్రూపును తొలగిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, ఈ గ్రూపు ఎప్పటిలాగే కొనసాగుతుందని ఆచార్య కేవీ స్వామి బుధవారం సాయంత్రం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. పొలిటికల్ సైన్స్ విభాగంలో ఏర్పడిన కొన్ని అంతర్గత సమస్యల కారణంగా 2025–26 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు తీసుకోకుండా తాత్కాలికంగా నిలిపివేయాలని భావించామన్నారు. అయితే విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్‌తో ఎప్పటిలాగే కొనసాగించాలనే నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు.