
కేసులు పెడితే దోషులవుతారా?
● మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
● ఎంపీ మిథున్‌రెడ్డితో ములాఖత్
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని దోషిగా ప్రచారం చేస్తోందని, ప్రభుత్వం కేసులు పెట్టినంత మాత్రాన దోషి ఎలా అవుతారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డితో మాజీ మంత్రి ధర్మాన, ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు బుధవారం ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయట ధర్మాన మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ మిథున్‌రెడ్డిపై కేవలం కొన్ని ఆరోపణలు మాత్రమే వచ్చాయన్నారు. న్యాయవ్యవస్థ దోషి అని నిర్ధారించలేదన్నారు. ప్రభుత్వం కేసులు పెట్టిన వారంతా దోషులు కారని స్పష్టం చేశారు. మిథున్‌రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో ప్రతి కుటుంబంతో వారికి మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ఇంతవరకు తుది చార్జిషీట్ వేయలేదన్నారు. చార్జీషీటు వేస్తే బెయిల్ వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయంతో మిథున్‌రెడ్డి ఉన్నారన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ.. మిథున్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే కుట్రతో అక్రమ కేసు పెట్టారన్నారు. జైల్లో మిథున్‌రెడ్డి ధైర్యంగా ఉన్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైఎస్సార్ సీపీ నేతలను జైలుకు పంపడంపైనే దృష్టి పెట్టిందని మండిపడ్డారు.