
ప్రజా సమస్యలపై అలసత్వం తగదు
– జేసీ చిన్నరాముడు
సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించరాదని, నిర్ణీత సమయంలో పరిష్కరించాలని జేసీ చిన్నరాముడు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో డీఆర్వో సీతారామమూర్తి, డీఎల్‌డీవో పి.వీణాదేవితో కలిసి ఆయన పీజీఆర్‌ఎస్‌లో అర్జీలను స్వీకరించారు. పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 159 అర్జీలు అందాయన్నారు. వీటిలో 150 అర్జీలను ఆఫ్‌లైన్‌లో, 9 ఆన్‌లైన్‌లో స్వీకరించామన్నారు. నిడదవోలు మండలం రావిమెట్ల గ్రామానికి చెందిన వీరమల్ల జోషికకు ఆయన వీల్‌చైర్ అందజేశారు. అలాగే హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై సమాచారం కోసం జాతీయ హెల్ప్‌లైన్ నంబర్ 1097 అందుబాటులో ఉందని జేసీ తెలిపారు. హెచ్‌ఐవీ నివారణకు ఏపీ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో 60 రోజుల విస్త్రత ప్రచార కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రచార కార్యక్రమ కరపత్రాన్ని విడుదల చేశారు.
ఉర్దూ టీచర్ల
నియామకానికి చర్యలు
మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు షరీఫ్
సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం)/రాజమహేంద్రవరం రూరల్: స్థానిక ప్రాధాన్యానికి అనుగుణంగా హైస్కూళ్లలో ఉర్దూ ఉపాధ్యాయులను నియమించాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ వెల్లడించారు. సోమవారం స్థానిక లక్ష్మివారపుపేటలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ అప్పర్ ప్రైమరీ మున్సిపల్ స్కూల్, కొంతమూరులోని జెడ్పీ హైస్కూళ్లను సందర్శించారు. అక్కడి ముస్లిం కుటుంబాలు, ఉపాధ్యాయులు, స్థానిక పెద్దలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో 12 ఉర్దూ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించినట్టు చెప్పారు. పరిస్థితులను బట్టి ఇంగ్లిష్ మీడియం బోధనను కూడా అందుబాటులోకి తెచ్చి, ఎలిమెంటరీ నుంచి జూనియర్ కళాశాలల వరకు ఉర్దూ నేర్చుకునే విద్యార్థుల సంఖ్య పెరగడానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. తరగతిలో కనీసం 10 మంది, పాఠశాలలో 40 మందికి పైగా విద్యార్థులున్న చోట ప్రత్యేక ఉర్దూ ఉపాధ్యాయులను నియమించేలా చూస్తామన్నారు. ఆయన వెంట రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, డీఈవో కె.వాసుదేవరావు, ఎంఈవో తులసీదాస్ తదితరులు ఉన్నారు.
ఎంఏ పొలిటికల్ సైన్స్‌ను
కొనసాగించాలని వినతి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఎంఏ పొలిటికల్ సైన్స్ గ్రూపును కొనసాగించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులు సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని జాయింట్ కలెక్టర్ చిన్నరాముడుకు వినతిపత్రం అందజేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై.భాస్కర్, ఎన్.రాజా, డీవైఎఫ్‌ఐ జిల్లా కో–కన్వీనర్ డి.అశోక్‌కుమార్ మాట్లాడుతూ, పొలిటికల్ సైన్స్ గ్రూపును యూనివర్సిటీ యాజమాన్యం ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు నిలిపివేయడం సరికాదన్నారు. యూనివర్సిటీ యాజమాన్యం చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా ఈ గ్రూపు లేకుండా చేయాలని చూస్తున్నారని విమర్శించారు. సమస్యలను పరిష్కరించి, గ్రూపును యథావిధిగా కొనసాగించకపోతే ఆ విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకపోతే విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలతో ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు.

ప్రజా సమస్యలపై అలసత్వం తగదు

ప్రజా సమస్యలపై అలసత్వం తగదు