
డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మాధవ్ రాష్ట్రంలో ‘సారథ్యం’ పేరుతో చేపడుతున్న యాత్ర సోమవారం రాజమండ్రి చేరింది. ఈ సందర్భంగా నగరంలో చాయ్ పే చర్చ, శోభాయాత్ర, పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కందుకూరి వీరేశలింగం పంతులుకు నివాళులర్పించారు. మాధవ్ మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి నేరుగా నిధులు ఇస్తోందన్నారు. ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 324 ఎంపీ సీట్లు వస్తాయని ఇండియా టుడే మూడ్ ఆఫ్ సర్వే తేల్చిందని, ఇప్పటికీ మోదీపై 58 శాతం ప్రజలు విశ్వాసం చూపుతున్నట్టు చెప్పారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, కూటమి ప్రభుతంలో కొన్ని ఇబ్బందులు సహజమని, సర్దుకుని ముందుకు వెళ్లాలన్నారు.
శోభాయాత్ర
నగరంలో ‘సారథ్యం’ శోభాయాత్రను వై–జంక్షన్ వద్ద మాధవ్ ప్రారంభించారు. జానపద కళారూపాలతో యాత్ర కంబాలచెరువు, దేవీచౌక్, గోకవరం బస్టాండ్ మీదుగా సుబ్రహ్మణ్య మైదానం వరకు సాగింది. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.