
దివ్యాంగులపై నిర్దయ
● అనర్హత పేరుతో నోటికాడ కూడును
లాగేస్తున్న కూటమి సర్కారు
● వైకల్యం శాతం తగ్గించి మరీ కుట్ర
● నిర్దాక్షిణ్యంగా పింఛన్ల తొలగింపు
● తామేం తప్పు చేశామంటూ
కలెక్టరేట్ వద్ద దివ్యాంగుల నిరసన
● తమ జీవితాలపై ప్రభుత్వం దెబ్బ కొట్టిందంటూ మండిపాటు
సాక్షి, రాజమహేంద్రవరం/సీటీఆర్‌ఐ: దివ్యాంగులపై కూటమి సర్కారు నిర్దయగా వ్యవహరిస్తోంది. వైకల్య శాతం తగ్గించేసి అనర్హత పేరుతో అడ్డగోలుగా పింఛన్లు తొలగిస్తోంది. వారికి ఆర్థిక ఆసరాను అందకుండా చేస్తోంది. పూర్తిగా మంచానికే పరిమితమైనా.. మానసిక వికలాంగులుగా ఉన్నా.. కనీస కనికరం లేకుండా నోటికాడ కూడును లాగేస్తోంది. ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్న వారి పింఛన్లు మార్పుచేస్తూ తీరని వేదన మిగులుస్తోంది. కూటమి ప్రభుత్వ చర్యలతో దివ్యాంగులు ఆవేదన చెందుతున్నారు. నాడు ఉన్న అర్హత నేడు ఎక్కడికి వెళ్లిందంటూ కన్నీళ్లు పెడుతున్నారు. ఏ ఆధారం లేని తమకు ఆర్థిక ఆధారం లేకుండా చేయడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పరంగా, పార్టీల పరంగా ఏవైనా ఉంటే వాళ్లతో తేల్చుకోవాలే తప్ప.. దివ్యాంగులను టార్గెట్ చేయడం తగదని ప్రభుత్వానికి హితవు పలుకుతున్నారు. తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలని, వైకల్యం తక్కువగా ఉందన్న నోటీసులు వెనక్కు తీసుకోవాలని దివ్యాంగులు కోరుతున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఆర్‌ఓ సీతారామమూర్తికి అందించారు. దివ్యాంగుల ఆందోళనకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు, దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు ముత్యాల పోసికుమార్, రూరల్ మండల అధ్యక్షుడు చాపల రాజా మద్దతు తెలిపారు.
జిల్లాలో 3,211 పింఛన్ల తొలగింపు
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అధికారిక లెక్కల మేరకు 33,688 మంది దివ్యాంగ కేటగిరిలో ప్రతి నెలా పింఛన్లు పొందుతున్నారు. వారిలో 1,321 మంది వివిధ రకాల హెల్త్ పింఛన్లు (రూ.15 వేలు) తీసుకుంటున్నారు. మిగిలిన 32,367 మంది రూ.6 వేల పింఛను పొందుతున్నారు. పింఛన్ల తొలగింపులో భాగంగా 19,928 మందికి సంబంధించిన వైకల్య శాతం తిరిగి పరిశీలించారు. వారిలో 3,211 మందికి ప్రభుత్వ నిబంధనల మేరకు వైలక్య శాతం లేదని నిర్ధారించారు. వీరిని అనర్హులుగా గుర్తించి పింఛన్లు రద్దు చేసినట్లు ఆయా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నోటీసులు అంటించారు.
దివ్యాంగులపై
ఇంత దారుణమా?
కూటమి ప్రభుత్వం దివ్యాంగులపై ఇంత కక్ష గడుతుందని అనుకోలేదు. పింఛన్లు తగ్గించుకునేందుకు ఏ ఆధారంలేని దివ్యాంగులపై కుట్ర చేయడం దారుణం. అంగ వైకల్య శాతం తగ్గించి మరీ పింఛన్లు తీసేయడాన్ని బట్టిచూస్తే దివ్యాంగుల సంక్షేమంపై ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతోంది. అంగ వైకల్యం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది కానీ.. ఇప్పుడు తగ్గిపోయిందని అనడం దారుణం. ఉన్న ఆర్థిక ఆసరాను లాగేస్తే తామెలా బతకాలంటూ వారు కన్నీరుమున్నీరవుతున్నారు. అయినా ప్రభుత్వం కనికరించడం లేదు. తొలగించిన పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం.
– సబ్బెళ్ల దుర్గావిజయరెడ్డి,
వికలాంగుల సంఘం
తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు
పింఛన్లు తగ్గించేందుకు కుట్ర
కూటమి ప్రభుత్వం అత్యంత పాశవికంగా వ్యవహరిస్తోంది. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామంటున్న ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా దివ్యాంగుల పింఛన్లు తొలగించడం దారుణం. 4 లక్షల పింఛన్లకు కోత వేసేందుకు దివ్యాంగులపై ప్రతాపం చూపుతున్నారు. వాళ్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరని వారిని టార్గెట్ చేశారు. తొలగించిన పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలి. లేని పక్షంలో వైఎస్సార్ సీపీ నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం.
– చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు

దివ్యాంగులపై నిర్దయ