సాక్షి, అమలాపురం: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆదివారం ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. కొన్ని చోట్ల ఉదయం వేళ ఓటింగ్ మందకొడిగా సాగినా.. సమయం గడిచేకొద్దీ ఊపందుకుంది. మధ్యాహ్నం తర్వాత కూడా ఓటర్లు బారులు తీరడంతో పోలింగ్ శాతం గణనీయంగా నమోదైంది. జిల్లాలో రెండో విడత 165 పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాగా, 20 పంచాయతీల సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో మూడు పంచాయతీలకు వార్డులకు ఎన్నికలు జరిగాయి. మిగిలిన 148 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. మొత్తం 4,86,729 మంది ఓటర్లకు గాను 3,79,220 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా సగటు పోలింగ్ 77.91 శాతంగా నమోదైంది.
ఆత్రేయపురంలో అత్యధికం
రెండో విడత ఎన్నికల్లో మండలాల వారీగా పోలింగ్ శాతాలను పరిశీలిస్తే.. ఆత్రేయపురం మండలం అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ 41,753 మంది ఓటర్లకు గాను 34,270 మంది ఓటు వేయడంతో 82.08 శాతం పోలింగ్ నమోదైంది. ఆలమూరు మండలంలో 80.53, అయినవిల్లిలో 79.43, రామచంద్రపురంలో 79 శాతం ఓటింగ్ నమోదైంది. కె.గంగవరంలో 78.62, అంబాజీపేటలో 76.90, రావులపాలెంలో 76.34, పి.గన్నవరంలో 76.18 శాతం పోలింగ్ జరిగింది. కొత్తపేట మండలంలో అత్యల్పంగా 74.41 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక్కడ 62,594 మంది ఓటర్లకు గాను 46,576 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రావులపాలెం మండలం గోపాలపురం హైస్కూల్‌లోని పోలింగ్ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మధ్యాహ్నం నుంచే లెక్కింపు
పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. తరువాత సర్పంచ్ పదవులకు కౌంటింగ్ జరిగింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఫలితాలు మొదలయ్యాయి. ముందుగా వార్డుల వారీగా ఫలితాలు, తరువాత సర్పంచ్ వెలువడనుండగా.. అనంతరం సర్పంచ్ స్థానాల ఫలితాలు స్పష్టమవుతాయి. గెలుపుపై ధీమాతో ఉన్న అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూశారు. గెలిచిన అభ్యర్థులు హంగామా సృష్టిస్తున్నారు.
తొలి విడత ఫలితాల ప్రభావం
ఇప్పటికే తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో రెండో విడత పోరుపై జిల్లాలో ఆసక్తి పెరిగింది. తొలి విడతలో వచ్చిన ఫలితాలు రెండో విడత అభ్యర్థుల్లోనూ ఉత్కంఠ పెంచాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీల మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థులకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.
మండలాల వారీగా పోలింగ్ ఇలా..
మండలం మొత్తం పోలైన శాతం
ఓటర్లు ఓట్లు
అయినవిల్లి 50,231 39,877 79.43
ఆలమూరు 55,084 44,361 80.53
అంబాజీపేట 47,742 36,713 76.90
ఆత్రేయపురం 41,753 34,270 82.08
కె.గంగవరం 46,558 36,606 78.62
కొత్తపేట 62,594 46,576 74.41
పి.గన్నవరం 58,139 44,288 76.18
రామచంద్రపురం 51,502 40,687 79.00
రావులపాలెం 73,126 55,822 76.34
మొత్తం 4,86,729 3,79,220 77.91
ఫ రెండో విడతలో 77.91 శాతం పోలింగ్
ఫ 148 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణ
ఫ మధ్యాహ్నం 4 గంటల నుంచి
ఓట్ల లెక్కింపు
కౌంటింగ్ కేంద్రం పరిశీలన
కొత్తపేట: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో కొత్తపేట గ్రామ పంచాయతీ ఓట్ల కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందితో మాట్లాడి పలు కీలక సూచనలు చేశారు. ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసేలా సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. డీఎస్పీ సుంకర మురళీమోహన్ తదితరులు ఉన్నారు.


