అమలాపురం టౌన్: స్థానిక ముస్లిం వీధిలోని దర్గా వద్ద సయ్యద్ హజరత్ ఖాజాబాబా 69వ ఉర్సు ఉత్సవాలు ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యాయి. పట్టణంలోని ముస్లింలే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన ముస్లింలు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. దర్గా నుంచి గుర్రంపై తీసిన గంధాన్ని ఉంచి పుర వీధుల్లో ఊరేగారు. బ్యాండ్ మేళాలు, పాటలతో ఊరేగింపు సాగింది. దర్గా నుంచి ప్రారంభమైన ఊరేగింపు ముస్లింవీధి, హైస్కూల్ సెంటర్, గడియారం స్తంభం మీదుగా సాగింది. ఈ ఉత్సవాలు సోమ, మంగళవారాల్లో కూడా జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. కోనసీమ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్, సయ్యద్ హజరత్ ఖాజాబాబా వారి ఉర్సు యువజన కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి.
అవిడిలో ఇరువర్గాల ఘర్షణ
● వైఎస్సార్ సీపీ శ్రేణులపై
కూటమి కవ్వింపు చర్యలు
కొత్తపేట: మండల పరిధిలోని అవిడి గ్రామంలో కూటమి, వైఎస్సార్ సీపీ వర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికుల కథనం ప్రకారం.. పంచాయతీ ఎన్నికల్లో అవిడి గ్రామం నుంచి విజయం సాధించిన టీడీపీ కూటమి శ్రేణులు ఆదివారం రాత్రి విజయోత్సవంలో భాగంగా ఆ గ్రామ వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎక్కువగా ఉన్న పెదపేట వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో ఆ గ్రామస్తులు మీరు ఇక్కడ ఆగకుండా వెళ్లిపోండి.. అని మర్యాదగా చెప్పారు. అయినా వినకుండా వారు మరింతగా రెచ్చిపోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. దీంతో ఇరువర్గాలు రాళ్లు, సీసాలు విసురుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ సుంకర మురళీమోహన్, ఎస్సై సురేంద్ర, ఇతర పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.
టీడీపీ వర్సెస్ బీజేపీ
గోకవరం: స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి నాయకుల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. ఆ వివరాల ప్రకారం.. గోకవరంలో సర్పంచ్ స్థానానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీడీపీ నుంచి గాజింగం సత్తిబాబు సతీమణి వల్లీదేవిని బలపర్చగా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంబాల శ్రీనివాస్‌రావు జనసేన పార్టీ నాయకుడు పదిలం మురళీ సతీమణి కనకలక్ష్మిని బలపరిచారు. జనసేన, బీజేపీ మద్దతుదారులు రెండు వర్గాలుగా విడిపోయి, ప్రచార సమయం నుంచి ఒక వర్గంపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఆదివారం ఉదయం స్థానిక మండల పరిషత్ కార్యాలయం సమీపంలోని ఓ పోలింగ్ కేంద్రం వద్దకు కంబాల శ్రీనివాస్‌రావు వచ్చారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమై తోపులాటకు దారితీసింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి పింపించారు. అనంతరం కంబాల శ్రీనివాస్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలింగ్ కేంద్రం పరిశీలనకు వెళ్లిన తనపై, తన అనుచరుడిపై టీడీపీ వర్గీయులు దాడి చేశారని ఆరోపించారు. అలాగే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గోకవరంలో కంబాల శ్రీనివాస్‌రావు కార్యాలయానికి చేరుకుని జరిగిన సంఘటనను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వీర్రాజు మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళుతున్నామన్నారు. కంబాల శ్రీనివాస్‌రావు, ఆయన అనుచరుడిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ దాడులను బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు.
గుర్తులు మార్చేశారని ఆందోళన
కొత్తపల్లి: అధికారులు కేటాయించిన గుర్తుతో ప్రచారం చేసుకుంటే.. తీరా పోలింగ్ కేంద్రం వద్ద అభ్యర్థులను తెలిపే నోటీసు బోర్డులో గుర్తులు మార్చేశారంటూ ఓ అభ్యర్థిని ఆందోళన చేశారు. కొత్తపల్లి ఎస్సీ పేటలోని ఎంపీపీ పాఠశాలలో 12వ వార్డుకు సంబంధించి పోలింగ్ కేంద్రాన్ని నిర్వహించారు. ఈ పోలింగ్ కేంద్రం వద్ద ‘గౌను’ గుర్తు కేటాయించిన కుమ్మరి రత్నం పేరు పక్కన ప్రెషర్ కుక్కర్ గుర్తు రాయడమేమిటంటూ ఆందోళన చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం సిబ్బందిని, బ్యాలెట్ బాక్స్‌లను తరలించకుండా ఆమె అడ్డుకున్నారు. రీ పోలింగ్ నిర్వహించాలని పట్టుబట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రం వద్దకు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ చేరుకున్నారు. తామిద్దరం ప్రచారం చేసుకున్న గుర్తుల ప్రకారమే విజయాన్ని కేటాయించాలని ఆయా అభ్యర్థులు జేసీకి వినతిపత్రం అందజేశారు.


