ముమ్మిడివరం: కమిని పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన చిన్నం మోహనరావు పోలింగ్ సమయంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని వైఎస్సార్ సీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి బీర చిన్నారావు ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్‌కు ఫిర్యాదు చేసి నకళ్లను విలేకర్లకు అందజేశారు. చిన్నం మోహన్‌రావు ఎన్నికపై విచారణ చేపట్టి రీకౌంటింగ్‌కు తగు ఆదేశాలు జారీ చేయాలని ఫిర్యాదులో కోరారు. కమిని పంచాయతీ జరిగిన ఎన్నికల ప్రక్రియలో భాగంగా కౌంటింగ్ సమయంలో ఇరువురి మధ్య రెండు ఓట్ల వ్యత్యాసం ఉండటంతో రీ కౌంటింగ్ కోరామని, అలాగే పోలింగ్ ప్రక్రియలో కూడా అక్రమాలకు జరిగాయంటూ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదని చిన్నారావు వాపోయారు.
స్థానిక శాసన సభ్యుడి సోదరుడు దాట్ల పృథ్వీరాజ్ అనధికారికంగా కౌంటింగ్ హాలులోకి ప్రవేశించి రిటర్నింగ్ అధికారితో మాట్లాడి రీ కౌంటింగ్ లేకుండా ఎన్నిక ధ్రువీకరణ ప్రకటించారన్నారు. ఆ సమయంలోనే రిటర్నింగ్ అధికారికి ఫోన్ కాల్స్ వచ్చాయని, దానిని ఆధారంగా రీకౌంటింగ్‌కు నిరాకరించారని ఆరోపించారు. టీడీపీ అనుచరులు దాట్ల పృథ్వీరాజ్, తాడి నరసింహారావు, కాకర్లపూడి రాజేష్‌లు తనపై దౌర్జన్యంగా దాడి చేసినా రిటర్నింగ్ అధికారి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
నేడు పీజీఆర్‌ఎస్ రద్దు
అమలాపురం రూరల్: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున సోమవారం కలెక్టరేట్, డివిజన్, మండల కేంద్రాల్లో జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)ను రద్దు చేసినట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.


