ఫ వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై
రాళ్లతో దాడి
ఫ విలసలో జనసేన నాయకుల దౌర్జన్యం
అమలాపురం టౌన్/ అయినవిల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపును జీర్ణించుకోలేక అయినవిల్లి మండలం విలస గ్రామంలో జనసేన నాయకులు రాళ్లతో దాడి చేసిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఆ గ్రామ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థిని కొప్పిశెట్టి రమణమ్మ గెలిచారు. గెలుపు ఆనందంతో వస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై జనసేన నాయకులు ఒక్కసారిగా రాళ్లతో దాడి చేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ధోరణిలో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. సుమారు 50 మంది జనసేన పార్టీకి చెందిన వారి దాడిలో ఐదుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తోటి పార్టీ నాయకులు, కార్యకర్తలు తక్షణమే అమలాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ముషిణి రాంబాబు, రాజేష్ మరో ముగ్గురు గాయపడ్డారు. ఆదివారం రాత్రి వరకూ పోలీసులు స్పందించ లేదు. ప్రభుత్వ ఆస్పత్రిలో క్షతగాత్రులు చికిత్స పొందుతుండడంతో మెడికో లీగల్ కేసు అయ్యే అవకాశం ఉంది.


