డీజిల్‌..నిల్‌ | - | Sakshi
Sakshi News home page

డీజిల్‌..నిల్‌

Apr 26 2026 2:21 AM | Updated on Apr 26 2026 2:21 AM

పెరుగుతున్న డీజిల్‌ కష్టాలు

బంకుల వద్ద నోస్టాక్‌ బోర్డులు

రైతుల పడిగాపులు

పోలీసుల పహారా మధ్య విక్రయాలు

సాక్షి, అమలాపురం/ఆలమూరు: జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత మరింత పెరిగింది. డీజిల్‌ కష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బంకుల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. పెట్రోల్‌ రేషన్‌ పద్ధతిలో కొంత వరకు దొరుకుతున్నా, డీజిల్‌ మాత్రం అందుబాటులో లేకుండా పోయింది. కొన్ని బంకుల వద్ద డీజిల్‌ ఉన్నా పోలీసుల సమక్షంలో అమ్మకాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. పెట్రోల్‌, డీజిల్‌ కోసం వినియోగదారులు.. బంకు యజమానుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీనితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన విక్రయాలు చేయాల్సి వస్తోంది. డీజిల్‌ కొరత లేదని, రైతులకు డీజిల్‌ ఇబ్బంది లేకుండా చేస్తామని అధికారులు ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నా, క్షేత్రస్థాయిలో సమస్య తీవ్రంగా ఉంది. డీజిల్‌ దొరకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న పొలాలను, పట్టుబడులకు వచ్చిన రొయ్యల చెరువులను వదిలి బంకుల వద్ద పడిగాపులు పడుతున్నారు.

పోలీసు బందోబస్తుతో..

ఆలమూరు శివారు కొత్తూరు సెంటర్‌ మెయిన్‌రోడ్డులోని ఒక పెట్రోల్‌ బంకులో శుక్రవారం రాత్రి డీజిల్‌ స్టాక్‌ అయిపోయింది. దీంతో పాటు పెట్రోల్‌ కూడా లేకపోవడంపై బంకు యాజమానులు, వినియోగదారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే బందోబస్తును ఏర్పాటు చేశారు.

జిల్లాలో బంకుల వద్ద..

జిల్లాలో పలు బంకుల వద్ద ఇలాంటి పరిస్థితి నెలకొంది. పెట్రోల్‌కు సంబంధించి మోటార్‌ సైకిళ్లకు రూ.200, కార్లకు రూ.ఐదు వందలు రేషన్‌ పెట్టడంపై వినియోగదారులు విరుచుకుపడుతున్నారు. పెట్రోల్‌ ఉన్నా తమ వాహనాలకు కొసరి కొసరి కొడుతున్నారని మండిపడుతున్నారు. బంకుల వద్ద క్యూలు పెరిగిపోయాయి. మోటారు సైకిళ్లు, కార్లు, ఆటోలు బారులు తీరుతున్నాయి. డీజిల్‌ దొరికే చోట కార్లు, ఆటోలతో పాటు లారీలు సైతం పెద్ద సంఖ్యలో క్యూలో ఉంటున్నాయి. ఇంతా చేసి తమ వంతు వచ్చే సరికి నో స్టాక్‌ బోర్డు పెడుతుండడంతో చూసి వాహనాల యజమానులు ఉసూరుమంటూ వెనుదిరగడం పరిపాటిగా మారింది.

డీజిల్‌ కొరత లేదంటున్నా..

జిల్లాలో డీజిల్‌ కొరత లేదని జిల్లా యంత్రాంగం చెబుతోంది. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో మాత్రం దానికి విరుద్ధంగా ఉంది. పెట్రోల్‌ కంపెనీల నుంచి పెట్రోల్‌, డీజిల్‌ రాక తగ్గిపోయింది. బంకు యజమానులు ఎప్పటికప్పుడు ఆర్డరు పెడుతున్నా కంపెనీల నుంచి వెంటనే డెలివరీ కావడం లేదు. ఇప్పుడున్న ధరలకు అమ్మకాలు చేస్తే లీటర్‌కు రూ.25 నుంచి రూ.30 వరకు నష్టం వస్తోందనే ఉద్దేశంతోనే కంపెనీలు సరఫరాపై నియంత్రణ విధించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వరి కోతలు

గత ఏప్రిల్‌, మే నెలలో జిల్లాలో వినియోగించిన డీజిల్‌కు అదనంగా పది శాతం డీజిల్‌ ఇవ్వాలని జిల్లా యంత్రాంగం చమురు కంపెనీలకు లేఖలు రాసింది. అయినా ఫలితం లేదు. పది శాతం అదనం మాట అటుఉంచితే సాధారణ వినియోగంలో 30 శాతం నుంచి 40 శాతం తక్కువగా డీజిల్‌ పంపుతుండడంతో కొరతకు కారణమనే ఆరోపణలున్నాయి. గ్రామీణ ప్రాంత పెట్రోల్‌ బంకుల వద్ద సాధారణ రోజులలో నాలుగు వేల లీటర్ల నుంచి ఐదు వేల లీటర్లు డీజిల్‌ విక్రయాలు జరిగేవి. వరి కోతల నేపథ్యంలో ప్రస్తుతం ఏడు వేల నుంచి ఎనిమిది వేల లీటర్ల వరకూ విక్రయాలు జరగడం పరిపాటిగా ఉంది. కానీ ఇప్పుడు చాలా బంకులలో ‘‘డీజిల్‌ రావాల్సి ఉంది’’ అని బోర్డులు వేలాడడంతో రైతులకు పాలు పోవడం లేదు.

ప్రభుత్వ మొద్దునిద్ర

పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపక పోవడంపై రైతులు, సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పంట కోతల సమయంలో డీజిల్‌కు ఇబ్బంది ఏర్పడినా, ప్రభుత్వం మొద్దునిద్ర పోవడంతో అన్నదాతలు మండిపడుతున్నారు. చమురు కంపెనీలను ప్రశ్నించే ధైర్యం ప్రభుత్వం చేయలేకపోతుందని ఆవేదన వ్యకం చేస్తున్నారు.

సిఫారసు లేఖలు ఉండాల్సిందేనా?

వరి కోత యంత్రాలు, నీరు తోడుకునే మోటార్లు, ఆక్వా చెరువుల వద్ద జనరేటర్లు, ఏరియేటర్లకు డీజిల్‌ కావాలంటే సిఫారసు లేఖ ఉండాల్సిందే. స్థానికంగా ఉన్న ఏవోలు, ఇతర అధికారులు లేఖ ఇస్తే కానీ డీజిల్‌ దొరకని పరిస్థితి జిల్లాలో నెలకొంది. అయితే వరి చేలు, చెరువులను వదిలి రైతులు అటు అధికారులు చుట్టూ, ఇటు బంకులు చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా ఉంది. పోనీ వాటిని పట్టుకుని బంకుల వద్దకు వెళ్లినా ఏ బంకుల వద్ద నిల్వ ఉంటుందో, ఎప్పుడు అయిపోతోందో తెలియని దుస్థితి నెలకొంది. డీజిల్‌ ఉన్నా గంటల తరబడి బంకుల వద్ద పడిగాపులు పడాల్సిందే.

పెట్రోల్‌ బంకుల వద్ద ట్రాఫిక్‌ జామ్‌

బంకుల వద్ద మోటారు సైకిళ్లు, కార్లు, ఆటోలు బారులు తీరడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంది. అమలాపురం నలుమూలల ట్రాఫిక్‌ నిలిచిపోయింది.ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళుతున్నాయి. కొత్తపేట వంటి ప్రాంతాలలో నుంచి భారీ వాహనాలు వెళ్లాల్సి రావడంతో అక్కడ కూడా ట్రాఫిక్‌ నిలిచిపోయి ప్రయాణికులు పడ్డారు. జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి ట్రాఫిక్‌ ఇబ్బందులు నెలకొన్నా పోలీసులు మాత్రం తమకు పట్టనట్టుగా వ్యవహరించడం విశేషం.

తీవ్ర ఇబ్బందులు

డీజిల్‌ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పొలాల్లో వరిని కోసేందుకు యంత్రానికి అవసరమైన డీజిల్‌ను మమ్మల్నే సమకూర్చుకోమంటున్నారు. పెట్రోల్‌ బంకుల వద్ద గంటల తరబడి పడిగాపులు పడలేకపోతున్నాం. డీజిల్‌ కొరతతో పంట కోతలు ఆలస్యమవుతున్నాయి. – మోటుపల్లి సత్తిబాబు,

రైతు, సంధిపూడి, ఆలమూరు మండలం

Advertisement
 
Advertisement
Advertisement