ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భారీగా భక్తులు తరలివచ్చారు. ముందుగా గౌతమీ గోదావరిలో స్నానాలు ఆచరించి, క్యూలో నిలబడి స్వామిని దర్శించారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శనివారం ఒక్కరోజే ఆలయానికి రూ.64,31,681 ఆదాయం వచ్చింది. ఆలయ ఈవో, దేవదాయశాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
కుక్ అండ్ హెల్పర్లను తొలగించం
● స్పష్టం చేసిన డీఈవో నాగేశ్వరరావు
● ‘సాక్షి’ కథనానికి స్పందన
కొత్తపేట: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి (ఎండీఎం) సంబంధించి మోడ్రన్ కిచెన్లు ఏర్పాటు చేసినా కుక్ అండ్ హెల్పర్లను తొలగించడం జరగదని జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి (డీఈఓ) పి.నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ‘మధ్యాహ్న భోజనానికి.. ప్రైవేటు ఎసరు‘ శీర్షికన సాక్షి పత్రికలో ఈ నెల 23న ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. దానికి వివరణ ఇస్తూ ప్రకటన విడుదల చేశారు. కడపలో 13 పాఠశాలలను కలుపుకొంటూ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో సుమారు 2,500 విద్యార్థులకు ఏర్పాటు చేసిన మోడ్రన్ కిచెన్ విజయవంతంగా నడుస్తోందన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటు మన జిల్లాలోనూ మోడ్రన్ కిచెన్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. గుర్తించిన మోడ్రన్ కిచెన్ పరిధిలోని పాఠశాలల్లో పని చేస్తున్న కుక్ కం హెల్పర్లందరికీ శిక్షణ ఇప్పించి, విద్యార్థులకు మెరుగైన పోషకాహారం, వేడి ఆహా రం అందించడానికి ఈ జిల్లాలో కూడా కొన్ని పాఠశాలలు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించామని పేర్కొన్నారు. ఇందుకు ఒక్కొక్క స్మార్ట్ కిచెన్‌నకు రూ.55.75 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు.
27 నుంచి లక్ష్మీనరసింహ
స్వామి కల్యాణోత్సవాలు
ఐ.పోలవరం: మురమళ్లలోని భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయ క్షేత్రపాలకుడైన లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవాలను ఈ నెల 27 నుంచి మే ఒకటో తేదీ వరకూ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో వి.సత్యనారాయణ శనివారం విలేకరులకు తెలిపారు. 27వ తేదీ సాయంత్రం 6.45 గంటల నుంచి కల్యాణ మహోత్సవం, 28న స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు, 29న మహదాశీర్వచనం, 30న నరసింహ జయంతి పూజా కార్యక్రమాలు, మే ఒకటిన పూర్ణాహుతి, చక్రస్నానం, పుష్పయాగం నిర్వహిస్తామన్నారు. భక్తులు తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకోవాలని ఆయన కోరారు.
విద్యుత్ బిల్లులు
నేడూ చెల్లించొచ్చు
అమలాపురం రూరల్: జిల్లాలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లో ఈ నెల 26 ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ విద్యుత్ బిల్లులను యథాతథంగా చెల్లించవచ్చని ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ ఎస్.రాజేశ్వరి తెలిపారు. అలాగే సెక్షన్ ఆఫీస్ కౌంటర్లు, ఏటీపీ కేంద్రాలు పనిచేస్తాయ న్నారు. జిల్లాలో విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించాలన్నారు.
ధాన్యం సేకరణలో జాప్యం వద్దు
ఉప్పలగుప్తం: ధాన్యం సేకరణలో జాప్యం జరిగినా, రైతుల నుంచి ఫిర్యాదులు అందినా కఠిన చర్యలు తీసుకుంటామని కొనుగోలు సిబ్బందిని జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిడియాదేవి హెచ్చరించారు. భీమనపల్లి –1 రైతు సేవా కేంద్రంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆమె తనిఖీ చేశారు. కొనుగోలు ప్రక్రియను, తేమ శాతాన్ని పరికరాల ద్వారా పరిశీలించారు.


