కూటమి అరాచకాలను అడ్డుకుందాం | - | Sakshi
Sakshi News home page

కూటమి అరాచకాలను అడ్డుకుందాం

Apr 26 2026 2:21 AM | Updated on Apr 26 2026 2:21 AM

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

జగ్గిరెడ్డి, విజయలక్ష్మి

గన్నవరపు ఆధ్వర్యంలో

మాజీ సర్పంచ్‌లకు సత్కారం

పి.గన్నవరం: కూటమి ప్రభుత్వం చేస్తున్న దోపిడీలను, అరాచకాలను అడ్డుకోవాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి పిలుపునిచ్చారు. పి.గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీకి చెందిన 30 మంది తాజా మాజీ సర్పంచ్‌లను శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో కో ఆర్డినేటర్‌ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. గన్నవరపు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జగ్గిరెడ్డి మాట్లాడుతూ జగన్‌ పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం జరిగిందన్నారు. కూటమి నేతలు ఎంత ఒత్తిడి చేసినా వైఎస్సార్‌ సీపీ సర్పంచ్‌లు పార్టీ మారలేదన్నారు. సర్పంచ్‌ పదవి నుంచి ఎప్పుడు దిగుతారు, ఏ విధంగా దోచుకుని తిందాం అన్న రీతిలో కూటమి నాయకులు ఎదురు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల పక్షాన బాధ్యత తీసుకుని కూటమి నాయకులను ఒక కంట కనిపెట్టి, వారి దోపిడీని అడ్డుకోవాలని జగ్గిరెడ్డి సూచించారు.

జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ దోపిడీతో విసుగు చెందిన ప్రజలు 2029లో జగన్‌ను మళ్లీ సీఎంను చేసేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరిగినా తాము అండగా ఉంటామన్నారు. జనసేన ఎమ్మెల్యే ఒక మహిళను ఇబ్బందులు పెడుతున్నా ఆయనపై చర్యలు తీసుకోలేదన్నారు. కుప్పం నియోజకవర్గంలోనే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ సీపీ కో ఆర్డినేటర్‌ గన్నవరపు మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా పార్టీ మారకుండా ప్రజలకు సేవలు అందించిన వైఎస్సార్‌ సీపీ మాజీ సర్పంచ్‌లను అభినందించారు. ఇదే స్ఫూర్తితో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు. కాగా.. జిల్లాలోని పలు ర్యాంపుల్లో కూటమి నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకుంటామని జగ్గిరెడ్డి హెచ్చరించారు. పి.గన్నవరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరిగిన తువ్వ, మట్టి దోపిడీని పలువురు నాయకులు జగ్గిరెడ్డి దృష్టికి తీసుకురాగా, ఆయన స్పందించారు. కూటమి నేతలు లంక భూములను గుల్ల చేస్తున్నారని అన్నారు. జి.పెదపూడిలో టిప్పర్‌ ఢీకొని ఒక వృద్ధుడు మృతి చెందాడన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు చింతలపాటి శ్రీనివాసరాజు, ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ బూడిద వరలక్ష్మి, మండల శాఖ అధ్యక్షులు యన్నాబత్తుల ఆనంద్‌, కొమ్ముల రాము, మట్టపర్తి శ్రీనివాస్‌, పార్టీ రాష్ట్ర నాయకులు మందపాటి కిరణ్‌కుమార్‌, దొమ్మేటి వెంకట శివరామన్‌, కుడుపూడి విద్యాసాగర్‌, గుత్తుల మధు, వడలి కొండయ్య, తోరం సూర్యభాస్కర్‌, కొంబత్తుల ఏసు బాబు, మిండగుదిటి శిరీష్‌, దొమ్మేటి సత్యమోహన్‌, నీతిపూడి విలసిత మంగతాయారు, కర్రి నాగిరెడ్డి, తోరం గౌతమ్‌, చేట్ల రామారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement