డీజిల్‌ను అవసరానికి మించి నిల్వ చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

డీజిల్‌ను అవసరానికి మించి నిల్వ చేయొద్దు

Apr 26 2026 2:21 AM | Updated on Apr 26 2026 2:21 AM

అమలాపురం రూరల్‌: డీజిల్‌ను అవసరానికి మించి నిల్వ చేయడంతో కృత్రిమ కొరత ఏర్పడుతోందని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ అన్నారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ డీజిల్‌ కొరత అంటూ కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల నేపథ్యంలో కొందరు అవసరానికి మించి నిల్వ చేస్తున్నారన్నారు. జిల్లాలో డీజిల్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియం, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ కంపెనీలను జిల్లాకు సరఫరాను 10 శాతం పెంచాలని ఆదేశించామన్నారు. వరి కోత యంత్రాలకు డీజిల్‌ ఇబ్బంది లేకుండా విలేజ్‌ అగ్రికల్చరల్‌ ఆఫీసర్‌ ఽధ్రువీకరణ పత్రం విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. వారి సంతకం ఉన్న పత్రాన్ని రైతులు బంకుల్లో చూపిస్తే ప్రాధాన్యత క్రమంలో డీజిల్‌ అందజేస్తారన్నారు. డీజిల్‌ సరఫరాలో సమస్యలు ఎదురైనా, అధిక ధరలకు విక్రయించినా 90599 20242, 94416 92275 నంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు.

కోకో పార్కు ఏర్పాటుకు వంద ఎకరాలు

కొబ్బరి విలువ ఆధారిత కోకో పార్క్‌ ఏర్పాటుకు సుమారు వంద ఎకరాల సేకరణకు చర్యలు చేపట్టినట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ వెల్లడించారు. ఆయన కలెక్టరేట్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల ద్వారా తలసరి ఆదాయం పెంపు, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసే దిశగా పలు ప్రతిపాదనలు రూపొందించడం జరిగిందన్నారు.

ఈవీఎం గోదాముల తనిఖీ

ముమ్మిడివరం: స్థానిక ఎయిమ్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం, వీవీప్యాట్‌ల భద్రతా గోదాములను కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ తనిఖీ చేశారు. నిర్దేశిత నెలవారీ తనిఖీల్లో భాగంగా రెవెన్యూ, పోలీస్‌, అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లు, సీలింగ్‌, రిజిస్టర్లను పరిశీలించి, సందర్శన రిజిస్టర్‌లో సంతకం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement