కాలువల పొడవు ఇలా..
తూర్పు డెల్టా కిలోమీటర్లు
ప్రధాన పంట కాలువ : 6.270
సామర్లకోట కాలువ : 53.010
కాకినాడ కాలువ : 40.550
మండపేట కాలువ : 21.750
కోటిపల్లి బ్యాంకు కెనాల్ : 63.560
కోరంగి కాలువ : 35.500
ఇంజరం కాలువ : 19.740
మంజేరు కాలువ : 14.870
మొత్తం పొడవు : 255.700
మధ్యడెల్టా
ప్రధాన పంట కాలువ : 13.200
ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్ : 62.44
అమలాపురం మెయిన్ కెనాల్ : 51.01
పి.గన్నవరం బ్యాంకు కెనాల్ : 59.10
అమలాపురం–
బెండమూర్లంక బెండా కాలువ : 8.00
మొత్తం పొడవు : 193.75
రెండు డెల్టాలు కలిపి : 449.45
సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టా పంట కాలువలు మూసివేసే సమయంలో చేపట్టే క్లోజర్ పనులు ఈ ఏడాది లేనట్టేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అధికారులు తీరు చూస్తుంటే క్లోజర్ పనులు మమ అనిపించేలా ఉన్నారు. ఈ పనులకు కోట్లాది రూపాయల నిధులు ఇస్తామని గొప్పలకు పోయిన చంద్రబాబు ప్రభుత్వం తీరా కేటాయింపులకు వచ్చేసరికి వట్టి చేతులు చూపుతోంది. చేసేది ఏమీ లేకనే ముందస్తు సాగు పేరుతో మే 15 నాటికి పంట కాలువలను తెరిచేందుకు సిద్ధంగా ఉన్నట్టు జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రం అన్నపూర్ణగా పేరొందిందీ అంటే అందుకు గోదావరి డెల్టా కారణం. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో 10.89 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ డెల్టాలో వరిసాగు 8.60 లక్షల ఎకరాలు. ఖరీఫ్, రబీ పంటలు కలిపి సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిగా వస్తోందని అంచనా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డెల్టా రెండు భాగాలుగా ఉంది. తూర్పు డెల్టాలో 2,65,533 ఎకరాలు, మధ్యడెల్టాలో 1,72,000 ఎకరాలు ఉన్నాయి. మొత్తం 4,36,533 ఎకరాలలో వరి సాగు జరుగుతోంది. తూర్పు, మధ్య డెల్టాలలో కలిపి పంట కాలువలు సుమారు 449.45 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. దీనిలో తూర్పు డెల్టా పరిధిలో 255.7, మధ్య డెల్టా పరిధిలో 193.75 కిలోమీటర్లు. వీటికి అనుబంధంగా చానల్స్, పంట బోదెలు కూడా ఉన్నాయి. వీటి నిడివి సుమారు 2 వేల కిలోమీటర్ల మేర ఉంటుందని అంచనా.
సమయం లేదు
ఇంతటి కీలకమైన వ్యవస్థ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం అవుతోంది. ఏటా క్లోజర్ సమయంలో చేయాల్సిన పనులను రెండు సంవత్సరాల పాటు చంద్రబాబు ప్రభుత్వం విజయవంతంగా ఎగ్గొట్టింది. తాజాగా ఈ ఏడాది చేయాల్సిన పనులు కూడా చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం పంట కాలువల ద్వారా రబీ వరి సాగుకు నీరందిస్తున్నారు. ఈ నెల 20 నాటికి ఈ కాలువలు మూసివేస్తామని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా చూస్తే మరో ఐదు రోజులు లేదా నెలాఖరు వరకు గాని నీరు అందించాల్సిన పరిస్థితి నెలకొంది. మే 15న న కాలువలు తెరిచే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు సూచనలు ఇస్తున్నారు. ఒకవేళ ఈ నెల 20న కాలువలు మూసివేసి, మే 15న తెరిస్తే మూసివేత సమయం కేవలం 25 రోజులు మాత్రమే. పంట కాలువల్లో నీరు అడుగంటి పనులు మొదలు పెట్టేందుకు కనీసం పది రోజులు పడుతుంది. అంటే పనులు చేసేందుకు కేవలం 15 రోజులు మాత్రమే అందుబాటులో ఉన్నట్టు లెక్క. అలా కాదని ఏటా ఇస్తున్నట్టు జూన్ ఒకటో తేదీన నీరు విడుదల చేస్తే పనులు చేసేందుకు నెల రోజుల సమయం దక్కుతుంది. అప్పడు కూడా కాలువలలో పూడికతీత, లాకులకు చిన్నచిన్న మరమ్మతులు, కల్వర్టులు, రివిట్‌మెంట్‌ల నిర్మాణానికి మాత్రమే సమయం సరిపోతుంది. భారీ నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉండదు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు ప్రభుత్వానికి క్లోజర్‌లో పనులు చేసే ఉద్దేశం లేదని వారు ఆరోపిస్తున్నారు.
ప్రతిపాదనలు మాత్రం భారీగా..
రెండు జిల్లాల పరిధిలో క్లోజర్ సమయంలో చేపట్టే పనులకు ప్రతిపాదనలు మాత్రం అధికారులు భారీగా పంపించారు. ఉమ్మడి జిల్లాలో పర్యటించిన వివిధ సందర్భాలలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్లోజర్ సమయంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామని హామీలు గుప్పించారు. ఈ నేపథ్యంలో అధికారులు ఒక్కో నియోజకవర్గానికి రూ.మూడు కోట్ల నుంచి రూ.నాలుగు కోట్ల చొప్పున ప్రతిపాదనలు పంపించినట్టు తెలిసింది. రెండు డెల్టాలలో కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం, అనపర్తి, మండపేట, పెద్దాపురం, కాకినాడ రూరల్, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాలున్నాయి. అధికారులు భారీగా ప్రతిపాదనలు పంపడం వల్ల నిధులు వస్తాయని, క్లోజర్‌లో పూడిక తొలగింపు, లాకుల మరమ్మతు వంటి పనులు వల్ల వచ్చే ఖరీఫ్, రబీలలో ముంపు ఇబ్బంది, శివారు ప్రాంతాలకు నీటి ఎద్దడి వంటి సమస్యలు గట్టెక్కుతాయన్న ఆయకట్టు రైతుల క్లోజర్ ఆశలపై ప్రభుత్వం నీళ్లు జల్లుతోంది. ప్రభుత్వం తీరు చూస్తుంటే అరకొరగా కేటాయింపులు చేసి ఆ పనులు కూడా చేపట్టే అవకాశం లేకుండా ఉందని రైతుల ఆరోపిస్తున్నారు.
ఈ ఏడాది డెల్టాలో క్లోజర్ పనులు లేనట్టే
నిధులిచ్చే పరిస్థితి లేక తెరపైకి
ముందస్తు సాగు
మే 15కి నీరిస్తామంటున్న అధికారులు
నియోజకవర్గానికి రూ.3 కోట్ల నుంచి
రూ.4 కోట్లతో ప్రతిపాదనలు
వాస్తవానికి కనీస మరమ్మతులు
కూడా గగనమే
రెండు జిల్లాల పరిధిలో 449.45
కిలోమీటర్ల పొడవునా పంట కాలువలు


