● సీతారామపురంలో వ్యక్తి ఆత్మహత్య
● మరణానికి ముందు సెల్ఫీ వీడియో, సూసైడ్ లెటర్
● భార్య, కూటమి నాయకులు, పోలీసులపై ఆరోపణలు
● కోరంగి పోలీస్ స్టేషన్ వద్ద కుటుంబ సభ్యుల నిరసన
● బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఐ హామీ
తాళ్లరేవు: కోరంగి పంచాయతీ సీతారామపురంలో పంపన కృష్ణ లోవరాజు(38) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మరణానికి ముందు రాజు విడుదల చేసిన సెల్ఫీ వీడియో పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. మృతుని కుటుంబ సభ్యులు, కోరంగి ఎస్‌ఐ పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు కాజులూరు మండలం శీల గ్రామానికి చెందిన రాజు పి.మల్లవరం ఓఎన్‌జీసీ కంపెనీలోని అగ్నిమాపకశాఖ విభాగంలో పనిచేస్తున్నాడు. శీల గ్రామానికి చెందిన అనుసూరి విజయ వనితాదేవి, రాజు 15 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి వీరేంద్ర వంశీ అనే 13 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. వీరు ప్రస్తుతం సీతారామపురం మరిడమ్మ కాలనీలో నివాసం ఉంటున్నారు. మృతుడు రాజు భార్య దేవి చెల్లెలు, రాజు తమ్ముడు ప్రేమించుకోవడంతో వారికి కూడా వివాహం జరిపించారు. అయితే అప్పటి నుంచి వీరి కుటుంబాల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. ఇటీవల భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరగడంతో స్థానిక కూటమి నాయకులు, గ్రామపెద్దల సమక్షంలో నచ్చజెప్పారు. రెండు రోజుల క్రితం ఇరువురి మధ్య మరోసారి ఘర్షణ తలెత్తడంతో దేవి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో దేవి కుటుంబ సభ్యులు కోరంగి పోలీస్ స్టేషన్‌లో రాజుపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రాజును అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే తన భార్య కనిపించడంలేదని పోలీస్‌స్టేషన్‌కు వెళితే తనపైనే కేసు నమోదు చేశారని, మొబైల్ ఫోన్ తీసుకుని వేధింపులకు గురిచేసినట్లు రాజు తమ వద్ద వాపోయాడని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తన ఇంటి కిచెన్‌లోని దూలానికి కేబుల్ వైరుతో ఉరివేసుకుని కనిపించాడు. అయితే అతని మృతి పట్ల కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెబుతున్నారు. దేవితోపాటు కొందరు కూటమి నాయకులు, పోలీసులు వేధింపుల వల్లే మృతి చెందాడని రాజు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు.
బాధ్యులను శిక్షించాలని కోరుతూ పోలీస్‌స్టేషన్ వద్ద నిరసన
అభం శుభం తెలియని వ్యక్తిపై లేనిపోని కేసులు పెట్టి వేధిస్తున్నారని బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలంటూ మృతుని బంధువులు కోరంగి పోలీస్‌స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనుమానాస్పద స్థితిలో మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కోరంగి ఎస్‌ఐ సత్యనారాయణ విలేకరులకు తెలిపారు. మరణానికి ముందు సెల్ఫీ వీడియో, సూసైడ్ లెటర్ ఉన్నాయని వాటి ఆధారంగా విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. రాజు మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
మరణానికి ముందు సెల్ఫీ వీడియో, సూసైడ్ లెటర్
తన భార్య ప్రవర్తన బావుండడం లేదని, తన అత్తింటివారితోపాటు కొందరు నాయకులు, బంధువులు తనపై లేనిపోని కేసులు పెట్టి తనను వేధిస్తున్నారంటూ రాజు సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. తన ఆిస్తి తన కుమారుడికే చెందాలని వీడియోలో కోరాడు. సెల్ఫీ వీడియోలో పంపన రామారావు, అత్తిలి బాబూరావు, డి.కృష్ణ, అనుసూరి కొండ, కనకదుర్గ పేర్లను రాజు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.


