బీవీసీలో కెవ్వు కేక..
ఆటపాటలతో విద్యార్థుల సందడి
అమలాపురం రూరల్: మయూక 2026 జాతీయ స్థాయి యువజనోత్సవాల ప్రారంభంతో భట్లపాలెం బీవీసీ కళాశాలలో సందడి నెలకొంది. కుర్రకారు ఆటపాటలతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా కేరింతలు కొట్టి హోరెత్తించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చి విద్యార్థుల జోష్‌తో కెవ్వు కేకలా కనిపించింది. అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తొలిరోజు పోటీలను డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ బోనం సతీష్ మాట్లాడుతూ విద్యతో పాటు యువజనోత్సవాలతో విద్యార్థులకు నూతన ఉత్సాహం వస్తుందన్నారు. వివిధ క్రీడా, సాంస్కృతిక పోటీలను బీవీసీ అక్షర్ ఇంటర్నేషనల్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ బోనం విజయలక్ష్మి పర్యవేక్షించారు. ఈ పోటీలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరొందిన రిఫరీలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి డాక్టర్ నైనా జైస్వాల్ ప్రత్యేక అతిథిగా హాజరై ప్రసంగించారు. క్రీడా పోటీలు విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు దృఢ సంకల్పంతో సాగితే విజయం వరిస్తుందని ఉద్బోధించారు. విద్య నేర్పిన గురువును ఎన్నడూ మర్చిపోవద్దు.. ధనం వచ్చాక స్నేహం మర్చిపోవద్దు.. భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోవద్దు.. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోవద్దు.. అవసరం తీరాక సహాయపడిన నేస్తాన్ని మరిచిపోవద్దని విద్యార్థులను ఉద్దేశించి ఆమె చేసిన ప్రసంగం ఆలోచింపజేసింది. అనంతరం పలు రకాల బైక్‌ల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బీవీసీ విద్యా సంస్థల అధినేత బోనం కనకయ్య, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జేవీజీ రామారావు, మయూక కన్వీనర్లు డాక్టర్ కె.శ్రీనివాస్, బీఎస్‌ఎస్ ఫణిశంకర్, క్రీడా, సాంస్కృతిక విభాగాల కోఆర్డినేటర్లు, వివిధ విభాగాల అధిపతులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జక్కం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
బీవీసీలో కెవ్వు కేక..


