చంద్రబాబు, పవన్ రాజీనామా చేయాలి
వైఎస్సార్ సీపీ నేతల డిమాండ్
రావులపాలెం: తిరుపతి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, చేప నూనె వంటి జంతు అవశేషాలతో కూడిన కొవ్వు కలిపారంటూ దుష్ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు, అయోధ్యకు లక్ష లడ్డూలు పంపారని మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ రాజీనామాలు చేసి క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. కొత్తపేట నియోజకవర్గ స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెం సీఆర్‌సీ ఫంక్షన్ హాలులో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామిపై సైతం రాజకీయం చేశారన్నారు. చివరికి సుప్రీంకోర్టు కలుగజేసుకుని చివాట్లు పెట్టినా వారికి బుద్ధి రాలేదని, సుప్రీంకోర్టు నియమించిన సిట్ నివేదికలో జంతు అవశేషాలతో కూడిన కొవ్వు పదార్థాలు లడ్డూల్లో లేవని తేలిందన్నారు. సనాతన వాది పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ ఆలయం మెట్లు కడుగుతారో చెప్పాలన్నారు. సనాతన వాదులం అని చెప్పుకునే మీరు మూడు రోజులపాటు విజయవాడ దుర్గ గుడికి కరెంటు లేకుండా అమ్మవారిని చీకటిలో పెట్టారని, ఇప్పుడు లడ్డూ విషయంలో సిట్ క్లీన్ చీట్ ఇచ్చిందని, ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు.
90 శాతం సమావేశాలు పూర్తి
కారుమూరి సునీల్ యాదవ్ మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసే దిశగా సంస్థాగత నిర్మాణం జరుగుతోందని ఇప్పటికి జిల్లాలో 90 శాతం సమావేశాలు పూర్తి చేశామన్నారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ సనాతన వాదిగా చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ సిట్ ఇచ్చిన నివేదికపై ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. లడ్డూపై నీచ రాజకీయాలకు పాల్పడిన చంద్రబాబుకు సిగ్గు ఉంటే రాజీనామా చేయాలన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జగన్‌మోహన్‌రెడ్డిపై చేస్తున్న దుష్ప్రచారాలు ఒక్కొక్కటిగా పటాపంచలు అవుతున్నాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం జగన్‌పై చేసిన అభియోగాలు తొలగిపోయి జగన్ పట్టాభిషిక్తుడయ్యే రోజు దగ్గరలో ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం నీతి అయోగ్ ద్వారా తయారు చేసి అమలు పరిచిన ల్యాండ్ టైట్‌లింగ్ యాక్ట్ పై నానా రాద్ధాంతం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు రీ సర్వే తమ ప్రభుత్వం చేస్తున్న గొప్పగా క్రెడిట్‌ను చోరీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు.
వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
ఈ సందర్భంగా నేతలు రావులపాలెంలోని శ్రీ అలివేలుమంగ పద్మావతి ఆండాళ్ సమేత వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశా రు. ఈ పూజల్లో విజయనగరం మాజీ ఎంపీ బెల్లా నా చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. 108 కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని, ఆయన చేసిన అపచారాన్ని క్షమించాలని, రాష్ట్రానికి మంచి జరగాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ, రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకుడు పాటి శివకుమార్, వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ సెల్ నాయకుడు, అముడా మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు, జెడ్పీటీసీ సభ్యులు కుడిపూడి శ్రీనివాసరావు, గూడపాటి రమాదేవి, బోణం సాయిబాబా, కొత్తపేట ఎంపీపీ మార్గాన గంగాధరరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యు లు బొక్కా వెంకటలక్ష్మి, సాకా ప్రసన్నకుమార్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సాకా మణికుమారి, మండల కన్వీనర్లు కనుమూరి శ్రీనివాసరాజు, బొక్కా కరుణాకరం, తమ్మన శ్రీను పాల్గొన్నారు.


