వైభవంగా భీమేశ్వరుని నగరోత్సవం
రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీ ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి, క్షేత్ర పాలకులైన లక్ష్మీ సమేత నారాయణస్వామి, చండికా సమేత సూరేశ్వరస్వామివార్ల కల్యాణ మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం ఉదయం పల్లకీలపై కల్యాణమూర్తుల నగరోత్సవం నిర్వహించారు. అనంతరం రాత్రి గరుడ వాహనంపై కల్యాణమూర్తులను మేళతాళాలతో ఊరేగించి నగరోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈఓ, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని ఆధ్వర్యంలో నిర్వహించిన నగరోత్సవంలో అర్చక స్వాములు, భక్తులు పాల్గొన్నారు.
కోటసత్తెమ్మ హుండీ ఆదాయం
రూ.23.77 లక్షలు
నిడదవోలు రూరల్: మండలంలోని తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ ఆలయ హుండీని గురువారం లెక్కించగా రూ.22,77,051 నగదు, అన్నదాన ట్రస్ట్ హుండీలో రూ.1,00,588 నగదుతో కలిపి మొత్తం రూ.23,77,639 నగదు, 15.5 గ్రాముల బంగారం, 376 గ్రాముల వెండి, ఐదు విదేశీ కరెన్స్ నోట్‌లు ఉన్నట్లు అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ వి.హరిసూర్యప్రకాష్ తెలిపారు. 106 రోజులకు సంబంధించిన అమ్మవారి హుండీ ఆదాయాన్ని జిల్లా దేవదాయశాఖ అధికారి ఇవీ సుబ్బారావు పర్యవేక్షణలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది లెక్కించారు. ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ప్రధాన అర్చకులు అప్పారావు శర్మ పాల్గొన్నారు.
8న బాలికల జాతీయ
స్థాయి సైన్స్ ప్రదర్శన
రాయవరం: వచ్చే నెల 8న పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు బాలికల జాతీయ స్థాయి సైన్స్ ప్రదర్శన రామచంద్రపురంలోని ఎంవీఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని రేవతి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.శ్రీకృష్ణసాయి గురువారం రాయవరం జెడ్పీ హైస్కూల్‌లో విలేకరులకు తెలిపారు. ఆసక్తి ఉన్న బాలికలు 2వ తేదీలోగా తమ పేర్లు 98661 30320 నంబరుకు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవాలన్నారు.
మిగిలిన 5 బార్లకు రీ నోటిఫికేషన్
అమలాపురం టౌన్: జిల్లాలో మిగిలిన ఐదు బార్లకు రీ నోటిఫికేషన్ బుధవారం విడుదలైందని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎస్‌కేడీవీ ప్రసాద్ తెలిపారు. మొత్తం 11 బార్లు ఉండగా 6 బార్లను గతంలోనే డ్రా ద్వారా కేటాయించామన్నారు. మిగిలిన 5 బార్లకు ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడంతో దరఖాస్తుల స్వీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు అమలాపురంలో గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. తాజా గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం అమలాపురంలో రెండు, ముమ్మిడివరంలో ఒకటి, రామచంద్రపురలో రెండు బార్లకు దరఖాస్తుల స్వీకరణ మొదలైందన్నారు. ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ దరఖాస్తుల స్వీకరణకు గడువు ఇచ్చారని వివరించారు. దరఖాస్తులను ముమ్మిడివరంలోని ఎయిమ్స్ కాలేజీ 2వ అంతస్తు భవనంలో గల జిల్లా ఎకై ్సజ్ కార్యాలయంలో స్వీకరించే ఏర్పాట్లు చేశామని తెలిపారు. స్వీకరించిన దరఖాస్తులను ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 8 గంటలకు కలెక్టరేట్ ప్రాంగణంలో గల గోదావరి భవన్‌లో కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా తీసి బార్లను కేటాయిస్తామని వివరించారు.


