సత్యదేవుని సన్నిధిలో భక్తునికి గుండెపోటు
అన్నవరం: భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్యదేవుని సన్నిధికి వచ్చిన ఓ భక్తుడు గుండెపోటుకు గురై, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. పెద్దాపురం మండలం దివిలి గ్రామ ఉప సర్పంచ్ అయిన వెన్నా సత్యనారాయణ (పండు) (55) కుటుంబ సభ్యులతో కలసి గురువారం ఉదయం అన్నవరం దేవస్థానానికి వచ్చారు. రూ.300 టికెట్టుతో సత్యదేవుని వ్రతమాచరిస్తున్న ఆయన హఠాత్తుగా ఒక పక్కకు ఒరిగిపోయారు. దేవస్థానం ఆస్పత్రి వైద్యాధికారి హరికృష్ణ వెంటనే వచ్చి పరీక్షించారు. బీపీ నార్మల్‌గానే ఉన్నప్పటికీ షుగర్ ఎక్కువగా ఉందని గుర్తించి, వెంటనే 108లో దేవస్థానం ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే సత్యనారాయణ మృతి చెందారని డాక్టర్ హరికృష్ణ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. దివిలి గ్రామంలో సత్యనారాయణ స్వీట్ షాపు నిర్వహిస్తున్నారని, స్నేహ ఆర్ట్స్ తరఫున నాటక పరిషత్‌ల నిర్వహణలో చురుకుగా పాల్గొనేవారని సన్నిహితులు తెలిపారు.


