సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్ర రాజధానిని లక్ష ఎకరాల్లో నిర్మిస్తామంటున్నారని, అంత భూమి అవసరమా అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతా మోహన్ ప్రశ్నించారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్, బెంగళూరు, భువనేశ్వర్‌లలో వెయ్యి ఎకరాలతో రాజధాని నిర్మించారన్నారు. రైతుల భూములు లక్ష ఎకరాలు ఎందుకు సేకరించాలని, వారి పొట్ట ఎందుకు కొట్టాలని నిలదీశారు. 50 అంతస్తుల భవనాలు నిర్మించాలని చంద్రబాబు అంటున్నారని, కృష్ణా తీరంలో అన్ని అంతస్తులతో భవనాల నిర్మాణం సాధ్యమా అని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టు కడతామంటున్నారని, వర్షం కురిస్తే ఆ ప్రాంతం ముంపునకు గురవుతోందని, అప్పుడు నీటిలో నడిపే విమానాలు తీసుకొస్తారా అని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం రాజధాని పూర్తి చేస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి చాలా చిన్న వయస్సు నుంచే తనకు తెలుసన్నారు. ఆయన తల్లిదండ్రులు కూడా తనకు తెలుసని, మిథున్‌రెడ్డి అరెస్టు చాలా బాధాకరమని మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. మిథున్‌రెడ్డి చిన్న బిడ్డ అని, రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు. చంద్రబాబు పాలన గురించి ఎంతో ఊహించానని, కానీ, ఆయన పాలన వలన రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. ఇప్పటి వరకూ అప్పులు చేయడానికే మాత్రమే చంద్రబాబు చూస్తున్నారు తప్ప రాష్ట్రానికి ఏ మేలూ చేయలేదని అన్నారు. రాష్ట్రంలో పోలీసులు పచ్చచొక్కా కనిపిస్తే సెల్యూట్ కొడుతున్నారని, మిగిలిన వారిని శత్రువులుగా చూస్తున్నారు ఇది సరికాదని మోహన్ అన్నారు.
ఫ చంద్రబాబు పాలన ఈవిధంగా
ఉంటుందని ఊహించలేదు
ఫ కేంద్ర మాజీ మంత్రి, సీనియర్
కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్