
సైబర్ మోసాలపై అవగాహన
అమలాపురం టౌన్: సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్న క్రమంలో బ్యాంక్‌ల ఖాతాదారులు ఆ మోసాల బారిన పడకుండా వారిలో చైతన్యాన్ని నింపి అవగాహన కల్పించాలని ఎస్పీ బి.కృష్ణారావు వివిధ బ్యాంక్‌ల అధికారులకు సూచించారు. స్థానిక ఎస్సీ కార్యాలయంలో సైబర్ మోసాల నియంత్రణపై శుక్రవారం జరిగిన వాణిజ్య బ్యాంకుల అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంక్ ఖాతాలపై ఎప్పటికప్పుడు పరిశీలన ఉండాలన్నారు. కేవైసీ సిస్టమ్స్‌ను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఖాతాదారుల ఖాతాల్లో అధిక మొత్తంలో నగదు లావాదేవీలు జరుగుతుంటే అలాంటి ఖాతాలను గమనించి మొదటి దశలోనే ఖాతాదారులను అప్రమత్తం చేయాలన్నారు. సైబర్ అఫెన్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ డిజిటల్ అరెస్ట్ వంటి నేరాలకు సంబంధించిన విషయాలను ఎస్పీ చర్చించి బ్యాంక్‌ల అధికారులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో నేరగాళ్లు భారీ ఎత్తున డబ్బును లూటీ చేస్తున్నారని వివరించారు. దీనిపై ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతీ బ్యాంక్‌లో సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు, అకౌంట్ ఫ్రీజ్ విషయంలో ‘1930’ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడానికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏర్పాటు చేయాలని ఎస్పీ సూచించారు. పలు బ్యాంక్‌ల మేనేజర్లతో పాటు జిల్లా అడిషనల్ ఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్, అమలాపురం, కొత్తపేట డీఎస్పీలు టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, సుంకర మురళీమోహన్, ట్రైనీ డీఎస్పీ ప్రదీప్తి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
బ్యాంక్ అధికారులకు ఎస్పీ కృష్ణారావు సూచన