
నాణ్యమైన ఆహారాన్ని అందించాలి
ముమ్మిడివరం: అన్న క్యాంటీన్‌లో నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. ముమ్మిడివరంలో గల అన్నా క్యాంటీన్‌ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. అక్కడికి వచ్చిన వారితో మాట్లాడి క్యాంటీన్ సమయానికి తెరుస్తున్నారా, ఆహార పదార్థాల నాణ్యత ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. నగర పంచాయతీ కమిషనర్ రవివర్మ, టౌన్ ప్లానింగ్ అధికారి రాజేష్‌బాబు, ఏఈ శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది, పాల్గొన్నారు.
ఆస్తి పన్ను ఆటోమ్యుటేషన్‌పై అవగాహన కల్పించాలి
కాకినాడ లీగల్: ఆస్తి రిజిస్ట్రేషన్‌తో పాటు వెంటనే ఆస్తి పన్ను ఆటోమ్యుటేషన్ చేసే ప్రక్రియపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్ర ఐజీ, జిల్లా ప్రత్యేక అధికారి జి.వీరపాండ్యన్ అన్నారు. ఆటోమ్యుటేషన్ విధానం అమలును తొలి రోజైన శుక్రవారం కాకినాడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన పరిశీలించారు. ఆస్తి పన్ను ఆటోమ్యుటేషన్ జరుగుతున్న తీరు, సమస్యలపై ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ వసూలు రికార్డులను పరిశీలించారు. రోజువారీ జరుగుతున్న రిజిస్ట్రేషన్ల సంఖ్య, రిజిస్ట్రేషన్ల పురోగతిపై ఆరా తీశారు. జిల్లా రిజిస్ట్రార్ జేఎస్‌యూ జయలక్ష్మిని వివరాలడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం సేవలపై కక్షిదారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరపాండ్యన్ మాట్లాడుతూ, ఆటోమ్యుటేషన్ ప్రక్రియపై ప్రజలకు అర్థమయ్యే రీతిలో కరపత్రాలు, బ్రోచర్లు ముద్రించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అందుబాటులో ఉంచాలని సూచించారు. రోజువారీ రిజిస్ట్రేషన్ల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన, ట్రైనీ కలెక్టర్ మనీషా, జాయింట్ సబ్ రిజిస్ట్రార్లు–1, 2 ఆర్‌వీ రామారావు, ఎస్‌వీఎస్‌ఎస్ వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.
తొలి రోజే ఇబ్బందులు
ఆస్తి పన్ను ఆటోమ్యుటేషన్ ద్వారా కాకినాడ, సర్పవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తొలి రోజే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తొలుత కార్పొరేషన్, మున్సిపాల్టీల్లో ఆస్తి పన్ను ఆటోమ్యుటేషన్ విధానంలో సమస్యలు రావడంతో క్రయవిక్రయదారులు ఇబ్బందులు పడ్డారు. కాకినాడ, సర్పవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆటోమ్యుటేషన్ ద్వారా తొలి రోజు చెరొక డాక్యుమెంట్ మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యాయి.

నాణ్యమైన ఆహారాన్ని అందించాలి