
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జిల్లా యూనియన్ ఎన్నిక
అమలాపురం టౌన్: జిల్లా మధ్యాహ్న భోజన పథకం కార్మికులు స్థానిక యూటీఎఫ్ హోమ్‌లో శుక్రవారం సమావేశమై జిల్లా కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కన్వీనర్ సీహెచ్ లోవలక్ష్మి అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా యూనియన్ గౌరవాధ్యక్షురాలిగా కె.కృష్ణవేణి, అధ్యక్షురాలిగా ఎస్.బేబీ సరోజిని, ప్రధాన కార్యదర్శిగా టి.నాగవరలక్ష్మి, కోశాధికారిగా ఎస్.వెంకటలక్ష్మి, ఉపాధ్యక్షులుగా దుర్గ, కరుణ, సంయుక్త కార్యదర్శిగా లోవలక్ష్మి ఎన్నికయ్యారు. మొత్తం 23 మందితో యూనియన్ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. మధ్యాన్న భోజన పథకానికి బడ్జెట్ పెంచి కార్మికులు వేతనాలు పెంచాలని సమావేశం డిమాండ్ చేసింది. కార్మికునికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.10 వేల వేతనం ఇవ్వాలని సూచించింది. వంట చేసేటప్పుడు కార్మికులకు ప్రమాదం జరిగితే రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సమావేశం డిమాండ్ చేసింది. సమావేశంలో కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం నినాదాలు చేశారు.