చివరి మజిలీ సౌకర్యంగా..
● కొత్తపేటలో కై లాసభూమి కార్యరూపం
● రూ.3 కోట్లతో ఎట్టకేలకు పూర్తి
● నెరవేరిన నంబూరి రెడ్డియ్య కల
● ఘనంగా ప్రారంభం
కొత్తపేట: అంతిమ సంస్కారాలకు అధునాతన సౌకర్యాలతో కై లాస భూమి కొత్తపేట పరిసర గ్రామల ప్రజలకు సమకూరింది. స్థానిక బోడిపాలెం వంతెన సమీపంలోని సూర్యగుండాల రేవు ప్రాంతంలో లయన్స్ క్లబ్ కై లాసభూమి ఎట్టకేలకు నిర్మితమైంది. ప్రముఖ వ్యాపారవేత్త, కేబుల్ నెట్‌వర్క్ అధినేత, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నంభూరి వీరవెంకట సత్య సూర్య రెడ్డియ్య 20 ఏళ్లనాటి ఆలోచనకు 13 ఏళ్లనాడు రూ.2 కోట్ల అంచనా వ్యయంతో కార్యరూపం దాల్చి ఎట్టకేలకు రూ.3 కోట్ల వ్యయంతో ఎట్టకేలకు నిర్మితమై శనివారం ప్రారంభమైంది.
ఘనంగా ప్రారంభోత్సవం
లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నంభూరి రెడ్డియ్య ఆధ్వర్యంలో ఎంపీ గంటి హరీష్‌మాధుర్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఈ కై లాసభూమిని ప్రారంభించారు. వివిధ విభాగాలను లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవీ ఈశ్వరకుమార్, మాజీ గవర్నర్ బాదం బాలకృష్ణ, కై లాసభూమి నిర్మాణ పర్యవేక్షకుడు కంఠంశెట్టి శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బండారు శ్రీనివాసరావు, రాష్ట్ర టీడీపీ నాయకుడు ఆకుల రామకృష్ణ, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం తదితరులు ప్రారంభించారు.
నాడు కల నేటికి సాకారం
2012వ సంవత్సరంలో స్థానిక లయన్స్ క్లబ్ ఏర్పాటుకు జరిగిన సమావేశంలో నంబూరి రెడ్డియ్య ఈ కై లాసభూమి ఆవశ్యకతను ప్రస్థావించారు. ఆయన ప్రెసిడెంట్‌గా క్లబ్ ఏర్పాటు కాగా కాలక్రమంలో కై లాసభూమి నిర్మాణంపై దృష్టిపెట్టారు. పవిత్ర సూర్యగుండాలపాయకు చేర్చి రూ.12 లక్షలతో 1.50 ఎకరాలు భూమిని కొనుగోలు చేశారు. రెడ్డియ్య వ్యక్తిగతంగా రూ.1.80 కోట్లు వెచ్చించారు. మిగిలిన మొత్తాన్ని దాతల నుంచి సేకరించారు. ఉపాధి నిధులు రూ.40 లక్షలతో కై లాసభూమి వరకు సీసీ రోడ్డు, మిగిలిన పనులకు పలు చోట్ల నిధులు సేకరించారు. ఈ నిధులతో ఒక అంతస్తుతో కూడిన భవనం (మృతదేహాలను భద్రపరిచే ఫ్రీజర్ విభాగం, అస్తికల లాకర్ల విభాగం, కార్యాలయం, సంతాప సభ కోసం హాలు సముదాయం), నాలుగు బెర్తులతో శవ దహనవాటిక, మృతదేహంతో ప్రదక్షిణ చేసే ఓం నమఃశివాలయ షెడ్డు, మృతుని బంధువుల వెయిటింగ్ భవనం, శివుని విగ్రహం, 24 ట్యాప్‌లతో జల్లు స్నానం పైపులైన్, పార్కు నిర్మాణం పూర్తిచేశారు. ఇంకా కలప షెడ్డు నిర్మాణం పూర్తికావాల్సివుంది.
నాడు పెద్దల అంత్యక్రియల్లో పుట్టిన ఆలోచన
2004 అక్టోబర్ 18న నా తండ్రి నంబూరి వీర్రాజు (సిద్ధాంతి) చనిపోయినప్పుడు ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించాం. అప్పుడే ఈ శ్మశానానికి వచ్చాను. ఏ సౌకర్యాలు లేక చాలా దుర్భరంగా ఉంది. 2005 జూన్‌లో రాజమహేంద్రవరంలో మా మావయ్య వాకచర్ల బంగారయ్య మృతి చెందగా అక్కడ రోటరీ కై లాసభూమిలో అన్ని సౌకర్యాల నడుమ అంత్యక్రియలు నిర్వహించాం. అటువంటి కై లాసభూమిని కొత్తపేటలో నిర్మించాలని సంకల్పించి ఎట్టకేలకు పూర్తిచేసి ప్రారంభించాం. చాలా సంతప్తిగా, ఆనందంగా ఉంది.
– నంభూరి వీవీఎస్‌ఎస్ రెడ్డియ్య,
కై లాసభూమి నిర్మాత, కొత్తపేట
చివరి మజిలీ సౌకర్యంగా..
చివరి మజిలీ సౌకర్యంగా..


