అయినవిల్లి: పాత ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా కూల్చివేసిన సంఘటన మండలంలోని వెలువలపల్లిలో చోటు చేసుకుంది. వివరాలివీ.. గ్రామంలోని పాత పోస్టాఫీసు వీధిలో పాత పాఠశాల భవనం ఉంది. నూతన పాఠశాల భవనం నిర్మించిన అనంతరం, మండల పరిషత్ నిధులతో పాత భవనానికి మరమ్మతులు చేశారు. అనంతరం ఆ భవనంలో మధ్యాహ్న భోజన పథకం వంటశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కొంత మంది స్థానికులు పాత భవనంలో పాడి గేదెలను కట్టి, పరిసరాలను పాడు చేశారు. దీనిపై స్థానిక అధికారులతో పాటు జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ స్థానిక ఎంపీడీఓ, ఎంఈఓలు ఈ విషయం తమ పరిధిలోనిది కాదని చెబుతూ సమస్యను పరిష్కరించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మోత బాబూరావు, తదితరులు శనివారం వచ్చి పాఠశాల భవనాన్ని దౌర్జన్యంగా కూల్చివేశారని, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి, సిమెంటు రేకులు, దూలాలు, ఇటుక తదితర మెటీరియల్‌ను ట్రాక్టర్‌పై తరలించుకుని పోయేందుకు ప్రయత్నించారని స్థానికులు తెలిపారు. వారికి అయినవిల్లిలంకకు చెందిన జేసీబీ ఆపరేటర్ సహకరించాడని చెప్పారు. దీనిపై స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనిపై ప్రధానోపాధ్యాయిని జి.లలితాదేవి, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్‌పర్సన్ నూకపెయ్యి దుర్గాదేవి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అనంతరం, ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామని ఎస్సై హరికోటిశాస్త్రి చెప్పారు.
ఫ మెటీరియల్ తరలించేందుకు యత్నం
ఫ పోలీసులకు ఫిర్యాదు
పాఠశాల భవనం కూల్చివేత