
తాగునీటి అవసరాలకు 24 గంటలూ విద్యుత్ సరఫరా
అమలాపురం రూరల్: తాగునీటి అవసరాలకు 24 గంటలూ విద్యుత్ సరఫరా ఉండాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఏపీ ట్రాన్స్‌కో ఇంజినీర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన సమావేశం నిర్వహించి విద్యుత్ టవర్ల ఏర్పాటు సందర్భంలో పవర్ కట్ అంశాలపై సమీక్షించారు. అమలాపురం డివిజన్‌లో మాత్రమే 24 గంటల వ్యవధిలో కేవలం 3 గంటల పాటు విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 90 టవర్లు వేయాల్సి ఉండగా ఇప్పటివరకు 60 టవర్లు నిర్మించినట్లు తెలిపారు. రామచంద్రపురం డివిజన్, కొత్తపేట డివిజన్‌లో ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట మండలాల్లో మినహా మిగిలిన మండలాలలో విద్యుత్ పవర్ కట్ ముందుగా నిర్దేశించిన గ్రామాలలో ఉంటుందని తెలిపారు. విద్యుత్ అంతరాయం ఉదయం 11 నుంచి 5 గంటల మధ్య ఉంటుందన్నారు. ఏపీ ట్రాన్స్‌కో విశాఖపట్నం జోనల్ చీఫ్ ఇంజినీర్ బి.శ్యాంప్రసాద్, ఎస్‌ఈ సిద్దాల రాజబాబు, గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ సీహెచ్ ఎన్వి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
క్లోజర్ పనులను వేగవంతం చేయాలి
వేసవి కాలువలు మూసి వేత సమయంలో వివిధ గ్రాంట్ల కింద మంజూరైన క్లోజర్ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జలవనరులు డ్రైనేజీ శాఖ ఇంజినీర్లతో పనులపై సమీక్షించారు.