
విక్రయ వస్తువుపై ధర, బరువు ఉండాలి
అమలాపురం టౌన్: విక్రయ వస్తువుల ప్యాకెట్లపై దాని ధర, బరువు లేదా కొలత విధిగా ఉండాలని అమలాపురం తూనికలు, కొలతలశాఖ (లీగల్ మెట్రాలజీ) అసిస్టెంట్ కమిషనర్ కె.రాజేష్ సూచించారు. కొనుగోలు చేసే ప్రతి వస్తువులకు సంబంధించి దుకాణాదారుని నుంచి బిల్లును అడిగే చైతన్యం వినియోగదారుల్లో రావాలని అన్నారు. అంతర్జాతీయ లీగల్ మెట్రాలజీ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎర్రవంతెన వద్ద గల ఆ శాఖ కార్యాలయంలో పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కొన్న వస్తువులకు బిల్లులు అడగడం ఓ హక్కుగా వినియోగదారులు భావించాలన్నారు. ముఖ్యంగా బంగారం విక్రయాలకు సంబంధించి వినియోగదారులకు ఇచ్చే బిల్లులపై విధిగా ఆ బంగారం ఎన్ని క్యారెట్లు వంటి వివరాలు ఉండాలని సూచించారు. వ్యాపార సంఘాల ప్రతినిధులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. రాష్ట్ర బంగారం, వెండి వర్తకుల సంఘం కోశాధికారి అనిల్‌కుమార్ జైన్, పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బోణం సత్యవరప్రసాద్ మాట్లాడుతూ తూనికలు, కొలతల నిబంధనలపై వ్యాపారస్తులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. వినియోగదారుల సంఘాల ప్రతినిధులు అమరేశ్వరరావు, అభిరామ్, అమలాపురం బంగారు, వెండి వర్తకుల సంఘం అధ్యక్షుడు మేడిచర్ల త్రిమూర్తులు, మెడికల్ అసోసియేషన్ ప్రతినిధిగా మోకా వెంకట సుబ్బారావు, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ప్రతినిధిగా దొమ్మేటి సాయిబాబు, వ్యాపారులు కొవ్వూరి వెంకటరెడ్డి, రేకపల్లి సత్యనారాయణమూర్తి, రాయుడు నాని, అనుపోజు శ్రీను, చవాకుల కృష్ణ, చింతలపూడి సత్తిబాబు ప్రసంగించారు. లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ గోకరకొండ వెంకట ప్రసాద్ పాల్గొన్నారు.
లీగల్ మెట్రాలజీ శాఖ
అసిస్టెంట్ కమిషనర్ రాజేష్