అమలాపురం రూరల్: వెంటనే 12వ పీఆర్‌సీ ఏర్పాటు చేయాలని, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం (ఏపీపీఆర్‌జీఏ) ఆధ్వర్యాన పెన్షనర్లు సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. 2023 జాలై 1వ తేదీ నుంచి పీఆర్‌సీ వేయాలని, ఐఆర్ ప్రకటించాలని, డీఏ, పీఆర్‌సీ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. డీఆర్, పీఆర్‌సీ బకాయిలు పొందకుండానే పెన్షనర్లు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈహెచ్‌ఎస్ కార్డులపై వైద్యం చేయబోమని ఆసుపత్రుల్లో చెబుతున్నారని అన్నారు. తక్షణమే మెడికల్ రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతిపత్రం పంపించామన్నారు. అనంతరం కలెక్టర్ మహేష్‌కుమార్‌కు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జొన్నలగడ్డ గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి పీవీవీ సూర్యనారాయణరాజు, కార్యదర్శి ఎస్‌వీ నాయుడు, కోశాధికారి ఎం.ఆశీర్వాదం తదితరులు వినతిపత్రం సమర్పించారు.
అప్రమత్తంగా ఇంటర్
మూల్యాంకనం
అమలాపురం టౌన్: స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని అత్యంత అప్రమత్తంగా నిర్వహించాలని జిల్లా ఇంటీర్మడియెట్ విద్యాశాఖాధికారి వనుము సోమశేఖరరావు ఆదేశించారు. మూల్యాంకనం నిర్వహిస్తున్న అధ్యాపకులు, జిల్లా పరీక్షల కమిటీ ప్రతినిధులతో సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 7 నుంచి కళాశాలలో సంస్కృతం, సోమవారం నుంచి తెలుగు, హిందీ, ఇంగ్లిషు, గణితం, పౌరశాస్త్రం జవాబు పత్రాల మూల్యాంకనం మొదలైందని చెప్పారు. మూల్యాంకనం నిర్వహిస్తున్న సిబ్బంది ఎవరూ సెల్ ఫోన్లు వాడరాదని స్పష్టం చేశారు. జవాబు పత్రాలను నిశితంగా పరిశీలిస్తూ దిద్దాలని సూచించారు. మార్కుల కేటాయింపులో అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.
బ్రిడ్జి కోర్సు పరీక్షకు 428 మంది గైర్హాజరు
ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు పరీక్షలు జిల్లాలో సోమవారం ప్రశాంతంగా జరిగాయని సోమశేఖరరావు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 11 కేంద్రాల్లో మొత్తం 2,336 మంది విద్యార్థులకు గాను 1,908 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారన్నారు. 428 మంది పరీక్షలు రాయలేదని తెలిపారు.
సుబ్బాలమ్మ తల్లికి రూ.26
లక్షలతో వెండి మకర తోరణం
అమలాపురం టౌన్: పట్టణ దేవత సుబ్బాలమ్మ అమ్మవారికి పలువురు భక్తులు రూ.26 లక్షల విలువైన 26 కిలోల వెండి మకర తోరణాన్ని సోమవారం సమర్పించారు. దేవస్థానం అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, భక్తులు ఈ మకర తోరణాన్ని ఉదయం అంతా ఆలయం వద్ద ప్రదర్శనగా ఉంచి, పూజలు చేశారు. సాయంత్రం రెండు అశ్వాల రథంపై దీనిని ఉంచి మంగళ వాయిద్యాలు, బాణసంచా కాల్పుల నడుమ అత్యంత వైభవంగా ఊరేగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. గరగ నృత్యాలు, కేరళ డప్పుల వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాత్రి సుబ్బాలమ్మ తల్లి సన్నిధిలో మకర తోరణాన్ని ఉంచి పూజలు చేశారు. అమ్మవారి జన్మదినం, దేవస్థానం సప్తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వెండి మకర తోరణాన్ని అమ్మవారి వద్ద అలంకరించారు.
12వ పీఆర్‌సీ ఏర్పాటు చేయాలి
12వ పీఆర్‌సీ ఏర్పాటు చేయాలి