
శతాధిక వృద్ధురాలి మృతి
అమలాపురం టౌన్: స్థానిక 22వ వార్డు పరిధిలోని గొవ్వాలవారి వీధికి చెందిన శతాధిక వృద్ధురాలు గొవ్వాల సూర్యకాంతం (110) ఆదివారం మృతి చెందారు. ఈమె 22వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్, వైఎస్సార్ సీపీ నాయకుడు గొవ్వాల రాజేష్ నానమ్మ. మూడు నెలల కిందటి వరకూ నానమ్మ ఏ ఒక్కరి సాయం లేకుండానే తన పనులు తాను చేసుకుంటూ జీవించిందని రాజేష్ తెలిపారు. మూడు నెలలగా మంచాన పడి చివరకు వృద్ధాప్యంతో మృతి చెందిందన్నారు. సూర్యకాంతానికి ఐదుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు, కోడళ్లు, అల్లుళ్లు, దాదాపు 40 మంది వరకూ మనుమలు, ముని మనుమలు ఉన్నారు.
అయినవిల్లికి భక్తుల తాకిడి
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామివారిని ఆదివారం ఆధిక సంఖ్యలో భక్తులు దర్శించుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీ గణపతి హోమం, గరిక పూజ వంటి విశేష పూజలు జరిపారు. ఆర్చకులు స్వామిని వివిధ పుష్పాలతో అలంకరించారు. స్వామికి మహానివేదన చేశారు. సాయంత్రం ఎనిమిది గంటలకు విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 56 మంది, శ్రీ లక్ష్మీగణపతి హోమంలో 31 జంటలు, స్వామివారి పంచామృతాభిషేకాలో ఒక జంట, స్వామివారి గరిక పూజలో రెండు జంటలు పాల్గొన్నాయి. పది మంది భక్తులు స్వామికి ఉండ్రాళ్ల పూజలు జరిపారు. స్వామి వారి సన్నిధిలో 11 మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు, ఐదుగురు చిన్నారులకు అన్న ప్రాసనలు, ముగ్గురు చిన్నారులకు నామకరణం, 13 మందికి తులాభారం, ఒకరికి నామకరణ చేశారు. స్వామికి 16 మంది తలనీలాలు సమర్పించారు. 25 నూతన వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. 3,510 మంది భక్తులు స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్కరోజు స్వామివారికి వివిధ పూజా టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.2,93,437 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
21న విద్యా విజ్ఙాన
విహార యాత్ర
ముమ్మిడివరం: జిల్లా విద్యాశాఖ అధ్వర్యంలో ఈ నెల 21న విద్యా విజ్ఙాన విహార యాత్ర నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా తెలిపారు. విద్యార్థుల విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంచడం లక్ష్యంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. డీఎస్‌ఓ జీవీఎస్ సుబ్రహ్మణ్యం, ఏఎంవో రాంబాబు, 116 మంది సెకండరీ విద్యార్థులు, 15 మంది ఉపాధ్యాయులతో కూడిన బృందం ఈ యాత్రలో పాల్గొంటుందన్నారు. తిరుపతి ఐఐటీ, తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్, తిరుపతి జంతు ప్రదర్శన శాలలు, తిరుపతి వెటర్నటీ యూనివర్సిటీ, చంద్రగిరి కోట, తూర్పు, పశ్చిమ గోదావరి పరివాహక ప్రాంతాలు, కోరంగి అభయారణ్యం, యానాం కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ యాత్ర ఉంటుందన్నారు. యాత్రలో పాల్గొనే విద్యార్థులు తల్లిదండ్రుల అనుమతి పత్రంతోనే రావాల్సి ఉంటుందన్నారు. విద్యార్థుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, మండల విద్యాశాఖాధికారులు ఈ పర్యటనను పర్యవేక్షిస్తుంటారన్నారు. ఈ యాత్ర విద్యార్థులకు వినూత్నమైన అవగాహనను అందించడంతో పాటు వారి భవిష్యత్ ప్రయాణానికి మార్గ దర్శకంగా నిలుస్తుందని విద్యాశాఖాధికారి షేక్ సలీం బాషా తెలిపారు.
యథావిధిగా ప్రజా
సమస్యల పరిష్కార వేదిక
అమలాపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా కలెక్టరేట్ గోదావరిభవన్‌లో జరుగుతుందని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లాస్థాయితో పాటు డివిజన్, మండలం, మున్సిపల్ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.
రత్నగిరికి భక్తుల వెల్లువ
అన్నవరం: రత్నగిరికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. స్వామివారిని మొత్తం 40 వేల మంది దర్శించగా, వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని అన్నప్రసాదాన్ని సుమారు 5 వేల మంది భక్తులు స్వీకరించారు.